మూడు వేల కోట్ల క్లబ్ లో ధురంధర్…!

Spread the love

భారతీయ సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది ‘ధురంధర్’. రూ.3 వేల కోట్ల క్లబ్‌లోకి ఒకే ఫ్రాంచైజీగా అడుగుపెట్టడం మాత్రం అసాధారణ ఘనత. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సినిమా సిరీస్‌గానే ‘ధురంధర్’ ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. హీరోగా రణవీర్ సింగ్ తన ఎనర్జీతో, స్టైల్‌తో ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈసారి ‘ధురంధర్’ సినిమాతో ఆయన తన కెరీర్‌లోనే కాదు, ఇండియన్ సినిమా స్థాయిలో కూడా భారీ హిట్ తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  దర్శకుడు ఆదిత్య ధర్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యద్భుత కథాకథనాలతో  తెరకెక్కించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో యాక్షన్, ఎమోషన్, దేశభక్తి అన్ని కలిసి ఒక పవర్‌ఫుల్ ఎక్స్పీరియన్స్ ను  ప్రేక్షకులకు అందించాయి. విడుదలైన రెండు భాగాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లను నమోదు చేశాయి. మొదటి భాగం ‘ధురంధర్ 1’ ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.1,307 కోట్ల భారీ కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత వచ్చిన రెండో భాగం ‘ధురంధర్: ది రివెంజ్ 2’ అయితే ఈ ఫ్రాంచైజీని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.1,712 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ రెండు సినిమాల కలిపి వసూళ్లు చూస్తే రూ.3,000 కోట్లను దాటేశాయి. ముఖ్యంగా చైనా, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాలు విడుదల కాకుండానే ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఈ మార్కెట్ల నుంచి కూడా పెద్ద మొత్తంలో వసూళ్లు వస్తాయి. కానీ అవి లేకుండానే ఈ రేంజ్‌కి చేరుకోవడం అంటే ‘ధురంధర్’ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఫ్రాంచైజీల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేవి బాహుబలి, పుష్ప. ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి సుమారు రూ.2,400  కోట్లకు పైగా వసూళ్లు, ‘పుష్ప’ ఫ్రాంచైజీ రూ.2వేల  కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ఈ రెండు సినిమాలు కూడా భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన భారీ  ప్రాజెక్టులుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ‘ధురంధర్’ ఈ రికార్డులను దాటేసి కొత్త చరిత్ర సృష్టించింది. ‘ధురంధర్’ విజయంతో ఇప్పుడు భారతీయ సినిమా మరింత పెద్ద మార్కెట్ గా కనిపిస్తోంది.  ఇక ఈ ఫ్రాంచైజీకి సంబంధించి మరో భాగం వస్తుందా? అనే ఆసక్తి కూడా అభిమానుల్లో పెరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు ఇంతటి విజయాన్ని సాధించడంతో, మూడో భాగం వస్తే అది మరిన్ని పెద్ద రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *