ధురంధర్ భామ… మెగాస్టార్ కూతురుగా…?

Spread the love

ఇటీవలి కాలంలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమాల్లో ‘ధురంధర్’ ఒకటి. గత డిసెంబరులో థియేటర్లలో విడుదలైనప్పుడు మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతోంది. సినిమాలో నటించిన రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు తమ అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్‌గా నటించిన సారా అర్జున్ ఈ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.  ఇప్పుడు ఆమెకు మరో పెద్ద అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి ఆమె మెగాస్టార్ చిరంజీవి కూతురి పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు బాబీతో మెగాస్టార్ ఒక చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నటీనటుల ఎంపికతో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా ప్రముఖ నటి ప్రియమణిను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. విలన్ పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన దర్శకుడు-నటుడు అనురాగ్ కశ్యప్ను తీసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కథలో అత్యంత భావోద్వేగభరితమైన హీరో కూతురి పాత్ర కోసం ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌ను ఫైనల్ చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఈ పాత్రకు కృతి శెట్టి పేరు వినిపించినప్పటికీ, చివరకు సారా ఎంపికైనట్లు సమాచారం. అయితే టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి దీని గురించి పూర్తి సమాచారం తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.