ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్- కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ముంబై ఇండియన్స్ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లో గెలచింది. ఇక ఈ హై స్కోరింగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. అజింక్య రహానే 67 (40; 3×4, 5×6), అంగ్క్రిష్ రఘువంశీ 51 (29; 6×4, 2×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఫిన్ అలెన్ 37 (17; 6×4, 2×6), రింకూ సింగ్ 33 (21;4×4) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, హార్దిక్ పాండ్య 1 వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ 78 (38; 6×4, 6×6), రికెల్టన్ 81 (43; 4×4, 8×6) లు మంచి ఆరంభాన్నిచ్చారు. మ్యాచ్ ను అప్పుడే దాదాపుగా కోల్ కతా నుండి లాగేశారు. తిలక్ వర్మ (20), హార్దిక్ పాండ్య (18నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (16) పరుగులు చేశారు. దీంతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 224 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ తీశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. రికెల్టన్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు.