ఆస్కార్ అవార్డుల రేసులో ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్’ మరో ముందడుగు 

Spread the love

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల రేసులో ఇండియన్ సినిమా ‘హోమ్‌బౌండ్’ మరో అడుగు ముందుకేసింది. భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ఈ సినిమా.. బెస్ట్ ఇంటర్నేషనల్  ఫీచర్ ఫిల్మ్ విభాగంలో టాప్ 15 చిత్రాల షార్ట్‌లిస్ట్‌ లో చోటు సాధించింది. దీంతో తుది నామినేషన్ సాధించడానికి ‘హోమ్‌బౌండ్’ కేవలం అడుగు దూరంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా పలు  దేశాల నుంచి వచ్చిన సినిమాలను పరిశీలించిన అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, తదుపరి రౌండ్ ఓటింగ్‌ కోసం 15 చిత్రాలను ఎంపిక చేసింది. ఈ లిస్ట్ లో ఫ్రాన్స్ నుంచి ‘ఇట్ వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్’, జపాన్ నుంచి ‘కొకుహో’,సౌత్  కొరియాకు చెందిన ‘నో అదర్ ఛాయిస్’ వంటి చిత్రాలతో పాటు ‘హోమ్‌బౌండ్’ పోటీ పడుతోంది. రెండో రౌండ్ ఓటింగ్ తర్వాత తుది నామినేషన్లను ఈ నెల‌ 22న అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15న లాస్‌ ఏంజిలెస్‌లో అవార్డుల ప్ర‌దానోత్సవం జరగనుంది.

నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన ‘హోమ్‌బౌండ్’ గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీ వేదిక  నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. ఇందులో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. లాక్‌ డౌన్ వంటి కఠిన  పరిస్థితుల్లో ఇద్దరు స్నేహితుల మధ్య బంధాన్ని, వారి కుటుంబాల్లోని సంఘ‌ర్ష‌ణ‌లను ఈ చిత్రం చూపించి ప్రశంసలు పొందింది.