ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కాగా, ఈ నేపథ్యంలో ఆయన వర్క్ చేస్తున్న’పెద్ది’ చిత్ర బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. నిప్పులు కురిపించే విజువల్స్ సిద్ధమవుతున్నాయి. PEDDI సెట్స్ నుండి అంటూ కొన్ని ఫోటోలు పంచుకుంది. రామ్ చరణ్ మరియు రత్నవేలు కలయికలో ఒక ‘మెగా పవర్ బ్లాస్ట్’ త్వరలో రాబోతోంది! అంటూ టీమ్ పోస్ట్ చేసింది. ఇక ఈ సినిమా హీరో రామ్ చరణ్ కూడా రత్నవేలుకు శుభాకాంక్షలు తెలిపారు. మీతో కలిసి పని చేయడం ఎప్పుడూ ఒక గౌరవంగా భావిస్తాను. మీ దార్శనికత ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతాలను సృష్టిస్తుంది. మీకు ఈ ఏడాది ఘనంగా సాగాలని కోరుకుంటున్నానని చరణ్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దేశవ్యాప్తంగా ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. 2026 ఏప్రిల్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.