తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. CBI నేతృత్వంలోని SIT సమర్పించిన రిపోర్ట్ లో ఒక్క లీటర్ పాలు కూడా నెయ్యి తయారీకి వాడలేదు అని తెలిపిందన్నారు. పామాయిల్ లో రసాయనాలు కలిపి కల్తీ నెయ్యి తయారు చేశారని ఆ రసాయనాలలో ఏమేమి కలిపారో నిర్ధారించే సాంకేతికత తమ వద్ద లేదు అని తేల్చిందని కల్తీ నెయ్యి వ్యవహారంలో 36 మంది నిందితులపై కేసులు నమోదు చేశారు.
తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చుకోవడం కోసం నిబందనలు మార్చారన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎప్పుడూ నిందించలేదని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఆనాడు నియమితులైన టీటీడీ పాలకమండలిదే పూర్తి బాధ్యత అని పేర్కొన్నారు. దోషులను వెనకేసుకు రాకుండా, చట్ట ప్రకారం విచారణకు సహకరించాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నివేదికను ప్రస్తావించిన తర్వాతే తనకు పూర్తి వివరాలు తెలిశాయన్నారు. హిందూ ధర్మంపై దాడులు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పేర్కొన్నారు.