సిసింద్రీ సినిమాతో తన చిన్ననాటే అప్పట్లో ఒక తరాన్ని అలరించి ఆకట్టుకున్నాడు అక్కినేని చిన్నోడు. తర్వాత అక్కినేని మూడు తారలు తెరపై కనువిందు చేసిన ‘మనం’ సినిమా లో హ్యాండ్సమ్ అండ్ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. వరుస చిత్రాలు చేస్తూ ప్రస్తుతం ‘లెనిన్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలో జన్మించాడు. 1995లో ‘సిసింద్రీ’ అనే సినిమాలో చిన్నారిగా నటించి, తన నటనా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. చిన్న వయసులోనే నటించిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. సినిమా సూపర్ గా రావడం తో అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక అఖిల్ హీరోగా తెరంగేట్రం చేసిన చిత్రం ‘అఖిల్’. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ, అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రం ద్వారా అఖిల్ ఎనర్జీ, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఆయనపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. తర్వాత ‘హలో’ (2017) ‘మిస్టర్ మజ్ను’ (2019) సినిమాలో ఒక ఫుల్ ఎనర్జిటిక్ లవర్‌బాయ్ క్యారెక్టర్‌ను పోషించి, యువతలో మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా పాటలు, స్టైల్, రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక 2021లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం ద్వారా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఐతే 2023లో విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం చాలా అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేకపోయింది. అయినా కూడా అఖిల్ తన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ సీన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక లెనిన్ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.