మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’ ముందుగా ప్రకటించినట్లుగానే మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తూ మూవీ టీమ్ ఒక అప్డేట్ ను అభిమానులతో పంచుకుంది. ఈరోజు ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ‘పెద్ది’ టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో విడుదల తేదీని మార్చి 27 అనే ఉంచింది. ఇక దీంతో సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లయింది.సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో రెహమాన్ సంగీత మాయాజాలం మరింతగా అలరించనుందని టీమ్ పేర్కొంది. ఆ పాట ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వాములుగా ఉన్నాయి.