మళ్ళీ పాత ఫార్ములానే నమ్ముకున్న రజిని కమల్

Spread the love

తలైవా రజినీకాంత్…లోక నాయకుడు కమల్ హాసన్. సుదీర్ఘ విరామం తరువాత ఇద్దరూ కలిసి ఒకే సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ చరిత్రలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఇద్దరు సూపర్ స్టార్స్  రజినీకాంత్ మళ్లీ ఒకే తెరపై కనిపించబోతున్నారన్న వార్త మొత్తం సౌత్ సినిమా ప్రపంచాన్ని ఉత్సాహంతో నింపింది. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి ఓ భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ చేయబోతుండటం అభిమానులకు పండుగలాంటిదే. గతంలో ఈ ఇద్దరూ కలిసి ఐదు భాషల్లో మొత్తం 21 సినిమాలు చేశారు. వాటిలో కొన్ని ద్విభాషా చిత్రాలుగా కూడా రూపొందాయి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో వీరి కలయికలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా 1976లో ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్  తెరకెక్కించిన అంతులేని కథ ఒక క్లాసిక్ సినిమా. ఇందులో రజనీకాంత్ పూర్తి స్థాయి పాత్రలో కనిపించగా, కమల్ హాసన్ అతిథి పాత్రలో మెరిశారు. ఆ తర్వాత 1985లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో కలిసి గిరఫ్తార్ చిత్రంలో ఇద్దరూ నటించారు. ఆ తర్వాత మాత్రం వీరిద్దరూ మళ్లీ కలిసి నటించలేదు. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ చేతులు కలపడం విశేషం. అది కూడా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా కోసం. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన  ప్రోమో కూడా అదిరిపోయింది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర అంశం బయటకొచ్చింది. ఈ హైటెక్ యుగంలో ఎక్కువగా డిజిటల్ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు వాడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కోసం దర్శకుడు నెల్సన్ టీమ్ పాత పద్ధతిని అనుసరిస్తున్నారట. అంటే డిజిటల్ టెక్నాలజీని పక్కనపెట్టి, సంప్రదాయ రీల్ కెమెరాలతో షూటింగ్ చేస్తున్నారని సమాచారం. 80, 90 దశకాల్లో క్లాసిక్ సినిమాలు ఎలా తెరకెక్కించేవారో, అదే విధంగా ఈ సినిమాను కూడా రూపొందించాలని ప్రయత్నిస్తున్నారట. పాత రోజుల వాతావరణాన్ని గుర్తు చేసేలా ఈ సినిమాను రూపొందించాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఇది ఒక విధంగా క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్‌కు నివాళిగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఫిల్మ్ రీల్‌తో షూట్ చేయడం ఒకటి, కానీ ఆ ఫుటేజ్‌ను ఎడిట్ చేయడం, ప్రాసెస్ చేయడం ఇప్పటి టెక్నీషియన్లకు ఎంతవరకు సులభం? ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ఎడిటింగ్‌నే ఉపయోగిస్తున్నారు. రీల్ ఫార్మాట్‌లో వచ్చిన ఫుటేజ్‌కు అవసరమైన నాణ్యత వస్తుందా? ఆ ప్రక్రియ సాఫీగా సాగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మొత్తానికి, కమల్ హాసన్ రజనీకాంత్ మళ్లీ కలిసి నటించబోతున్నారనే వార్తే అభిమానుల్లో చాల ఉత్సాహాన్ని కలిగిస్తోంది. అందుకు తోడు పాత తరహా మేకింగ్ స్టైల్‌ను అనుసరించాలనే ప్రయత్నం ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఆధునిక తమిళ సినిమాకు ఒక కొత్త దిశను చూపించినట్టే అవుతుంది. కానీ ఎదురయ్యే సవాళ్లను టీమ్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఈ చారిత్రక కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *