తమిళనాడు సీఎం విజయ్, మెగాస్టార్ చిరంజీవిల ఆత్మీయ సంభాషణపై ఆసక్తికర చర్చ

Spread the love

ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌ కు చిరంజీవి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేసినట్లు తెలుస్తోంది. . తమిళ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన దివంగత నేత ఎం.జి.రామచంద్రన్  తరహాలో ప్రజల మనసుల్లో నిలిచిపోయే నాయకుడిగా ఎదగాలని చిరంజీవి ఆకాంక్షించినట్లు తెలుస్తోంది. దీనికి స్పందించిన విజయ్ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడినట్లు సమాచారం. చిరంజీవి తనకు ఫోన్ చేసి అభినందనలు చెప్పడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ప్రస్తుతం చిరంజీవి చేయబోతున్న ‘మెగా 158’ సినిమాకు కూడా విజయ్ తన శుభాకాంక్షలు తెలియజేశారట. ఇక ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. విజయ్ ఇటీవల చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాను చూసినట్లు టాక్ వినిపిస్తోంది. ఆ సినిమాలో చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ తనకు చాలా నచ్చాయని విజయ్ చెప్పినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా దక్షిణాది స్టార్ హీరోల మధ్య పరస్పర గౌరవం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ స్థాయిలో ఆప్యాయతతో మాట్లాడుకోవడం అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు ఒక విషయం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదే తమిళ, తెలుగు సినీ పరిశ్రమల మధ్య ఉన్న అనుబంధం. చిరంజీవి – విజయ్ ఫోన్ సంభాషణ ఆ స్నేహానికి మరో ఉదాహరణగా నిలిచిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు భాషలకు చెందిన స్టార్ హీరోలు అయినప్పటికీ.. ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం ఈ సంభాషణ ద్వారా బయటపడిందని అంటున్నారు. విజయ్ కుటుంబానికి చిరంజీవితో చాలా కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. ముఖ్యంగా విజయ్ తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్  దర్శకత్వంలో చిరంజీవి గతంలో పలు సినిమాలు చేశారు. ఆ సినిమాలు అప్పట్లో మంచి విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘చట్టానికి కళ్ళు లేవు’, ‘పల్లెటూరి మొనగాడు’, ‘దేవాంతకుడు’ వంటి చిత్రాలు చిరంజీవి కెరీర్‌లో కీలకమైన సినిమాలుగా నిలిచాయి. విజయ్ కుటుంబం, చిరంజీవి మధ్య అనుబంధం ఇప్పటి విషయం కాదు. చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆత్మీయ సంబంధం ఇది. ఇప్పుడు అదే బంధం మరోసారి బయటపడటంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *