ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సీనియర్ భారతీయ సినీ నటుడు కమల్ హాసన్ చిత్ర పరిశ్రమకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖలో పేర్కొన్నారు. పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, వాణిజ్యం, లాజిస్టిక్స్ మరియు ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, రవాణా, మరియు ఉత్పత్తి ఖర్చుల ప్రభావం భారతదేశంపై కూడా తప్పనిసరిగా పడుతోంది. ఈ క్రమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు, ఈ సంక్షోభం బడ్జెట్లు ఇప్పటికే విపరీతంగా పెరిగిపోతున్న మరియు మార్కెట్ రికవరీలు ఇంకా అస్థిరంగా ఉన్న సమయంలో వచ్చింది. పెరుగుతున్న ఖర్చులు కేవలం సినిమా నిర్మాణాన్ని మాత్రమే ప్రభావితం చేయవు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా రాబోయే నెలల్లో వినోదం కోసం ప్రేక్షకులు ఖర్చు చేసే విధానాలు కూడా మారవచ్చని అభిప్రాయపడ్డారు.
ఈ భారం కచ్చితంగా నిర్మాతలు, కార్మికులు, థియేటర్లు, పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్లు), ఫైనాన్సియర్లు మరియు ఈ మొత్తం వ్యవస్థపై పడుతుంది. సినిమా ప్రయాణం ఇలాగే ముందుకు సాగాలంటే, మనం పెట్టే ప్రతి రూపాయి కేవలం పైపైన కనిపించే గ్రాండ్‌నెస్ కోసం కాకుండా, సినిమా కథకు ఉపయోగపడేలా చూసుకోవాలని సూచించారు. అలాగే సినిమా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే ఏ ప్రయత్నమైనా… కార్మికుల వేతనాలు, వారి భద్రత, గౌరవం, ఆహారం, రవాణా, వసతి లేదా మానవీయ పని వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని కూడా పేర్కొన్నారు. రాత్రింబవళ్లు కష్టపడే కార్మికులపై ఈ భారాన్ని నెట్టలేమని అన్నారు. వృథా ఖర్చులు, సరైన ప్రణాళిక లేకపోవడం, భారీ ఆడంబరాల సంస్కృతి, అనవసరమైన విదేశీ ప్రయాణాలు, నిర్మాణంలో ఆలస్యం, మరియు పెట్టే ఖర్చుకు-సినిమాకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసం వంటివాటిని గురించి పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా ఒక మేధోమథనం జరగడానికి ఇది సరైన సమయమని నమ్ముతున్నట్లు తెలిపారు. రాబోయే ఆర్థిక సవాళ్లను మనం సమిష్టిగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడానికి… నిర్మాతలు, నటులు, దర్శకులు, యూనియన్లు, స్టూడియోలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లు మరియు గిల్డ్‌ల మధ్య పరిశ్రమ వ్యాప్తంగా ఒక చర్చ జరగాలన్నారు.
చిత్ర పరిశ్రమ అంతా కలిసి సమర్థవంతమైన సినిమా నిర్మాణం కోసం ఆచరణాత్మకమైన మరియు స్థిరమైన పని విధానాలను అభివృద్ధి చేయాలన్నారు. ఖర్చులను తగ్గించుకోవడం, తగిన స్థానిక ప్రత్యామ్నాయాలు ఉన్నప్పుడు అనవసరమైన విదేశీ ప్రయాణాలను పరిమితం చేయడం, సెట్లు మరియు స్టూడియోలలో ఇంధన/విద్యుత్ పొదుపును పాటించడం, మరియు పర్యావరణానికి హాని చేయని సెట్ల నిర్మాణం అలాగే వస్తువుల పునర్వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి కీలక అంశాలను ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన వినియోగం మరియు సమిష్టి క్రమశిక్షణ కోసం దేశం ఇస్తున్న పిలుపు, ప్రపంచవ్యాప్త అస్థిరత నెలకొన్న ఇలాంటి సమయాల్లో ప్రతి రంగం ముందస్తు ఆలోచనతో, సంయమనంతో వ్యవహరించాలని గుర్తుచేస్తోందని భారతీయ చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ సమయానికి తగినట్లుగా స్పందించాలన్నారు. ఇది వ్యక్తిగత ప్రయోజనాల కంటే దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయమని పేర్కొన్నారు. ఈ రోజు మనం సినిమా ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటే, రేపు సినిమా భవిష్యత్తును కాపాడుకున్నట్లవుతుందని అన్నారు.