‘పెద్ది’ ఓవర్సీస్…ఎంట్రీ ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్

Spread the love

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సాన  తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నెల 18న ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుండగా..జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఏర్పడిన ఈ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడే ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ సంస్థ ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఇంతకుముందు ఈ హక్కులు ప్రత్యంగిర సినిమాస్ వద్ద ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఈ డీల్ ఎలా మారింది? హోంబలే ఎలా రంగంలోకి వచ్చింది? అనే విషయాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ట్రేడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ సినిమా మీద విదేశీ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో ఈ ఒప్పందం జరిగి ఉండొచ్చని అంటున్నారు.

హోంబలే ఫిల్మ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ఇటీవల భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత నమ్మకమైన బ్యానర్‌లలో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా కథల ఎంపికలో వీరి స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్థానికత ఉన్న కథలను పాన్ ఇండియా స్థాయిలో ఎలా చూపించాలో ఈ సంస్థ బాగా అర్థం చేసుకుంది. ‘కాంతార’ వంటి చిన్న కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడం, ‘కేజీఎఫ్’తో ఇండియన్ మాస్ సినిమాకు కొత్త ఇమేజ్ ఇవ్వడం, ‘సలార్’తో యాక్షన్ సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రెజెంట్ చేయడం హోంబలే ప్రత్యేకతగా మారింది. ఇప్పుడు అదే సంస్థ ‘పెద్ది’ ద్వారా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అధికారికంగా అడుగుపెడుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇప్పటి వరకు హోంబలే ఫిల్మ్స్ ప్రధానంగా నిర్మాణ సంస్థగానే పనిచేసింది. కానీ ఇప్పుడు నేరుగా అంతర్జాతీయ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోవడం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ‘పెద్ది’లాంటి భారీ సినిమాతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం వెనుక కూడా ఒక పెద్ద వ్యూహం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం విదేశాల్లో తెలుగు సినిమాలకు అద్భుతమైన మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ దేశాల్లో స్టార్ హీరోల సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. అలాంటి మార్కెట్‌లో రామ్ చరణ్‌కు ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆయనకు గ్లోబల్ రీచ్ మరింత పెరిగింది. దీంతో ‘పెద్ది’ సినిమాపై విదేశీ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *