నందమూరి అభిమానులందరూ ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఒకే ఒక్క ప్రశ్న నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం ఎప్పుడన్నది. ఐతే చిరు కి చరణ్, నాగ్ కి అఖిల్ ఇంకా నాగ చైతన్య ఉన్నారు కానీ బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇదే సమయంలో బాలయ్య మాత్రం యువ హీరోలకంటే వేగంగా సినిమాలు చేస్తూ వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. టాలీవుడ్‌లోని పలువురు యువ దర్శకులు బాలకృష్ణతో సినిమా చేయాలని కథలు వినిపిస్తూ డేట్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మోక్షజ్ఞ పరిచయంపై గత కొన్నేళ్లుగా అనేక వార్తలు వినిపించాయి. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాతోనే ఆయనను హీరోగా పరిచయం చేయాలని ఒక దశలో బలమైన ప్రచారం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల అది ముందుకు సాగలేదు. ఆ తర్వాత మరికొన్ని కథలు, దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు క్లాసిక్ చిత్రం ఆదిత్య 369 కు సీక్వెల్ గా రూపొందే ఆదిత్య 999లో మోక్షజ్ఞ నటిస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అందులో బాలకృష్ణ స్వయంగా నటిస్తారనీ, ఆయన దర్శకత్వం వహించే అవకాశం ఉందనీ… లేకపోతే దర్శకుడు క్రిష్ తెరకెక్కించవచ్చనే చర్చలు కూడా సాగాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ అరంగేట్రం మళ్లీ ప్రశాంత్ వర్మ చేతుల్లోనే జరిగే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ‘సింబా’ అనే title పరిశీలనలో ఉందని, ఇది సోషియో-ఫాంటసీ నేపథ్యంతో రూపొందే భారీ కథ అని వినిపిస్తోంది. ఈ తరహా జానర్ ప్రేక్షకులకు సులభంగా కనెక్ట్ అవుతుందని, కనీసం మంచి టాక్ వచ్చినా భారీ విజయంగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో వస్తే, సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడం పెద్ద విషయం కాదని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. అందుకే బాలకృష్ణ కూడా ఈ కథపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఇంకా ఒక ముఖ్య అంశం ఏమిటంటే: ఈ సింబా ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మ సృష్టిస్తున్న సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఉండబోతుందనే ప్రచారం. ఆయన తెరకెక్కించిన హను-మాన్ అనూహ్య విజయంతో ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ విజయంతో దర్శకుడిపై బాధ్యత మరింత పెరిగింది. ఇప్పుడు ఆయన ఒక పెద్ద సూపర్ హీరో ప్రపంచాన్ని నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ యూనివర్స్‌లో తదుపరి భాగంగా రూపొందుతున్న చిత్రం జై హనుమాన్. ఇందులో హనుమంతుడి పాత్రను కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించగా, ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ చేతుల్లో మోక్షజ్ఞ అరంగేట్రం జరిగితే అది సాధారణ డెబ్యూ కాకుండా, పాన్-ఇండియా స్థాయి ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి చూస్తే, ఎన్నో ఊహాగానాల మధ్య మోక్షజ్ఞ సినీ ప్రవేశం ఇంకా అధికారికంగా ప్రకటించబడకపోయినా… పరిస్థితులు మాత్రం క్రమంగా స్పష్టత దిశగా కదులుతున్నాయి. ప్రశాంత్ వర్మ వంటి విజయవంతమైన దర్శకుడి చేతుల్లో ఈ బాధ్యత పడితే, నందమూరి అభిమానుల నిరీక్షణకు ఘనమైన ఫలితం దక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక నిజమైన ప్రకటన ఎప్పుడు వస్తుందో… ఆ రోజు నందమూరి అభిమానులకు పండుగరోజుగా మారడం ఖాయం.