సాంకేతికత ఎప్పుడూ మానవాళి సేవలోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల జీవితాల్లో మా రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (RTGS) విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ తో నేడు ఆయన సమావేశమయ్యారు. ఏపీ సెక్రటేరియట్ లోని ఆర్టీజీఎస్ సెంటర్ ను బిల్ గేట్స్ సందర్శించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా లో చంద్రబాబు ఒక పోస్ట్ చేశారు. పాలనలో వేగాన్ని, వ్యాపార నిర్వహణలో సౌలభ్యాన్ని ఇది నిజసమయంలో అందిస్తోందని పేర్కొన్నారు. 1990వ దశకంలో మిస్టర్ బిల్ గేట్స్‌తో జరిగిన సమావేశం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది; ఆనాటి ఆ చర్చలే నేడు సాంకేతికత ద్వారా పౌర సాధికారతకు బాటలు వేశాయని పేర్కొన్నారు. యువ మేధావుల పనితీరుతో నడుస్తున్న మా RTGS కేంద్రాన్ని, అలాగే విద్య, వ్యవసాయం మరియు ఆరోగ్య రంగాల్లో మేము చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలను ఈరోజు ప్రదర్శించడం ఎంతో సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఇక ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని విద్య, వైద్యం మరియు వ్యవసాయ రంగాలను బలోపేతం చేసేందుకు గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు.