సనాతనంగా వెలుగొందుతూ భక్త కోటికి ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతూ విరాజిల్లుతున్న క్షేత్రం. ద్వాపర యుగంలో ధర్మరాజు స్వయంగా ప్రతిష్టించిన పుణ్యక్షేత్రం.. సాక్షాత్తు కనకవర్షం కురిసిన పరమ పవిత్ర స్థలం.. అదే విజయవాడ ఇంద్రకీలాద్రి పాదభాగాన వెలిసిన అత్యంత పురాతన ‘పాత శివాలయం’ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈరోజు మనం ఈ క్షేత్ర విశిష్టతను తెలుసుకుందాం.
ద్వాపర యుగంలో పాండవ అగ్రజుడైన ధర్మరాజు ప్రతిష్టించిన కారణంగా ధర్మపురిగా పేరుగాంచింది. ఈ శివాలయం ఒకప్పుడు వేయిస్తంభాల గుడిగా విరాజిల్లుతూ తూర్పు దిక్కున తారాపేట రైల్వే గూడ్స్ షెడ్డు వరకు, ఉత్తరమున చిట్టినగర్ కొత్త అమ్మవారి గుడి వరకు, దక్షిణాన కృష్ణానది ఒడ్డు వరకు, పడమర ఇంద్రకీలాద్రి పర్వత పాదం వరకు విలసిల్లుతూ ఉండేదని తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్రకు సంబంధించిన మరో గుడి స్తంభం విజయవాడ వన్ టౌన్ ఆవుల వారి వీధిలో ఉన్నది.
క్రీ.శ 5వ శతాబ్దంలో విజయవాడను పాలించిన మాధవవర్మ కాలంలో ఈ స్థలంలో పాత మల్లేశ్వరుని ఆశీస్సులతో కనకవర్షం కురిసినదని శాసనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణం క్రీ.శ 808 – 847 సం||ల మధ్యలో నిర్మించబడినదని చారిత్రక ఆధారాలుగా ఉత్తర ద్వారం వద్ద ఉన్న శిలా స్థంభ శాసనాలు చెబుతున్నాయి. పంచారామ దేవాలయవలెనే ఈ దేవాలయానికి నేటికీ పెద్ద ఎత్తున ఆలయ గోపురం, పెద్ద ఎత్తున ప్రాహరీ గోడలు, ఆ గోడలకు 1008 గుళ్లు దీపారాధనకు కట్టుబడి చేసి చక్కగా కనబడుతున్నాయి. 60 అడుగుల ఎత్తైన గాలిగోపురం ఈ దేవాలయం ప్రత్యేకత.
ఇంద్రకీలాద్రి పర్వత పాదభాగమున ఉన్న కనక పాత శివాలయంగా, పార్థునిచే పూజలందుకున్న శివాలయం కనుక పార్థ శివాలయంగా అత్యంత పురాతన, సనాతన ఆలయం కనుక పాత శివాలయంగా ఎందరో ఋషులు, దేవతలు, యుగపురుషులు సనాతనలు అర్చించారు. కావున మనోవాంఛ ఫలసిద్ధి పొందు ఆలయంగా ప్రసిద్ధి కెక్కినది. పాత శివాలయంలో ఆగ్నేయమూల ఉన్న కాత్యాయని ఇష్టకామేశ్వరి మాతకు నేతి దీపం వెలిగించి చేతబూని శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఆలయ ప్రదక్షిణం చేస్తే ఉత్తమ పురుషున్ని, కోరుకున్న వారిని భర్తగా పొందుతారని ప్రసిద్ధి. దక్షిణం వైపు ఉన్న మృత్యుంజయేశ్వరుడు, ఉత్తర ద్వారం నుండి భక్తులకు అపమృత్యువులను పోగొడుతున్నాడు. నిత్యము నిజ ఉత్తర ద్వార దర్శనమే ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈ మల్లేశ్వర స్వామిని దర్శించిన ఇహపర సుఖ శాంతులు పొందగలరని ప్రతీతి.
జగద్గురు ఆదిశంకరాచార్యులు ఇక్కడనే అమ్మవారి సన్నిధిలో శాంతి యంత్రం ప్రతిష్టించారు. అందువలనే ఇచ్చట ఉన్న శ్రీ చక్రం శ్రీశైల భ్రమరాంబ వారి వద్ద నున్న శ్రీ చక్రంను పోలి ఉంటుంది. దుర్గమ్మ పాదముల క్రింద పడుకొనియున్న ఈశ్వరుడే పాద శివాలయంలో పాద మల్లేశ్వరుడై భక్తితో కొలిచిన విద్యార్థులకు మేధాశక్తి ప్రాప్తి, అవివాహితులకు కళ్యాణం జరగడం, పెద్దలకు రోగ, అపమృత్యుభయం నుండి విముక్తి, పిల్లలకు బాలారిష్టములు తొలగించునని విశ్వాసం. మహా శివరాత్రి రోజూ రథోత్సవంలో కొండపైనున్న దుర్గమ్మ క్రింద పాద మల్లేశుని చెంతనున్న రథం ఎక్కి ఉత్సవంలో ఊరేగే ఆచారం నేటికీ కొనసాగుతుంది.
ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాలు మాఘ బహుళ ఏకాదశి నుండి ఫాల్గుణ శుద్ధ విదియ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. విశేషంగా చైత్ర మాసంలో వసంత నవరాత్రి కళ్యాణ మహోత్సవాలు, శ్రావణ మాసం దసరా, కార్తీక మాసంలో శ్రీ భ్రమరాంబ అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలు చాలా వైభవముగా జరుగుతాయి. ఈ పాత శివాలయం సకల దేవత నిలయంగా ప్రసిద్ధి కెక్కింది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీ భ్రమరాంబ అమ్మవారి మల్లేశ్వర స్వామిని దర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.