తమిళనాడు లో త్వరలో జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్, నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని వ్యాసర్పాడిలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారికి విజయ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్. ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ వంటి ముఖ్య నేతలు ఆయనతో ఉన్నారు. విజయ్ నామినేషన్ కార్యక్రమానికి మంచి ప్రజా స్పందన లభించింది. వ్యాసర్పాడికి దారితీసే ప్రధాన మార్గాలు, కాలేజీ ప్రాంగణం బయట వేలాది మంది టీవీకే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా గుమిగూడారు. రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్న టీవీకే పార్టీకి పెరుగుతున్న రాజకీయ ఆదరణకు ఇది నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రధాన పార్టీల సీట్ల సర్దుబాట్లు కూడా పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమి, డీఎంకే కూటములు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇక విజయ్ కూడా మూడో ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకు రానున్న నేపథ్యంలో ఎన్నికల సమరం మరింత ఆసక్తికరంగా మారనుంది. ఏ పార్టీకి ప్రజలు పట్టంకడతారో చూడాలి. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరగనుండగా..మే 4న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.