
Food Safety Day: గాలి, నీరు ఆ తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది ఆహారం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే హక్కు ఉంది. ఆహారం మన ఆరోగ్యానికి, శరీరానికి చాలా అవసరం. భమి మీద ఆహారం లేకుండా ఏ ప్రాణి మనుగడ సాగించలేదు. అందుకే మన పెద్దలు ఆహారాన్ని వృధా చేయకూడదు అని అంటుంటారు. వైవిధ్యం, పోషణ, స్థోమత, భద్రతతో కూడిన పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలి. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహిస్తోంది. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం. అసలు ప్రతి ఏటా..ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం. ఇది ఎప్పుడు మొదలైంది? దీన్ని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
1945, అక్టోబర్ 16న ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ స్థాపించబడింది. దీనికి గుర్తుగా ఇదే రోజున ప్రతి సంవత్సరం ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ ఏడాదితో ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.పేదరికం, యుద్ధ సంఘర్షణలు, వాతావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో ఎఫ్ఏఓ పనిచేస్తోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృథా అవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తి అయిన ఆహారంలో 19 శాతం వృథా అయినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కబెట్టారు. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదిక వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తెలిపింది. భారతదేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఆహార వృథాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి.
ఇదిలా ఉంటే మోతాదుకు మించి రసాయనాల వినియోగం, పంట మార్పిడి పద్ధతులు పాటించకపోవడం. నేలలు సారం కోల్పోవడం వల్ల గత 70 ఏళ్లలో మనం పండిస్తున్న వివిధ ఆహార పంటలలో పోషకాలు, విటమిన్లు లోపిస్తున్నాయి.దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది సూక్ష్మ పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. హార్ట్ అటాక్స్ తో అర్థంతరంగా ప్రాణాలు కోల్పోతున్న సంఖ్య చాలానే ఉంది. ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఈ రెండు వ్యాధులలో ఏదో ఒకదానితో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అంతే కాదు 2050 నాటికి ప్రపంచ ఆహార డిమాండ్ ను తీర్చాలంటే ఇప్పుడు ఉన్న భూమి నుంచే 60 శాతం వ్యవసాయ ఉత్పత్తులు పెరగాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే మరోవైపు అధిక మోతాదులో జంక్ ఫుడ్ తీసుకోవడం చాలా మందికి అలవాటైపోయింది. శారీరక శ్రమ లేకపోవడం, ఆహార కల్తీ వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 900 మిలియన్ల మంది యువత, 35.5 మిలియన్ల ఐదు ఏళ్ల లోపు చిన్నారులు ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు.
మరోవైపు సుస్థిరమైన ఆహార వ్యవస్థలను పెంపొందించడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ భూమి తగ్గిపోతోంది. కలుషితమవుతున్న నేల, నీరు, గాలి, పంట మార్పిడి లేకపోవడంతో సారవంతమైన నేలలు తగ్గిపోతున్నాయి. వాతావరణ మార్పులు వల్ల అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. నాణ్యత లేని విత్తనాలు, మొలక శాతం తగ్గుతోంది.చీడపీడల ఉధృతి పెరిగిపోతోంది. పెట్టుబడి రుణాల భారంతో లాభాసాటి ఆదాయం లేక రైతులు కుదేలవుతున్నారు. జనాభా వృద్ధిరేటుకు తగ్గట్లుగా వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల ఉండటం లేదు.యువత సైతం వ్యవసాయంపైన పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
పాడి పశువులను పెంపొందించడంలోనూ రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ప్రధానంగ పాడి పశువులను దాణా కొరత వేధిస్తోంది. ఎగుమతి సబ్సిడీలు, ఆహార దిగుమతులు, ఆర్థిక మందగమనం, మార్కెట్లోకి ఎక్కువ మోతాదులో ఒకే రకమైన పంట చేతికి వచ్చినప్పుడు ధరల ఆటుపోట్లకు గురికావడంతో రైతుల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని సందర్భాల్లో పంటనష్టం, నిల్వ చేసే గోడౌన్లు లేకపోవడం, ఉత్పత్తికి సరిపడా ప్రాసెసింగ్ చేసే ఆహార పరిశ్రమలు అందుబాటులో లేకపోవడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తు ఆహార భద్రత పైన తీవ్ర ప్రభావం చూపుతోంది. కష్టపడి పనిచేసినా రాబడికి హామీ లేని వ్యవసాయ ఉత్పత్తి చక్రంలో చాలా మంది రైతులు ఇప్పటికీ చిక్కుకున్నారు. Food Safety Day.
సమీకృత వ్యవసాయం, పంట మార్పిడి, వ్యవసాయ వ్యర్థాల నిర్వహణ, పంట ఉత్పత్తుల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించినప్పుడే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టవచ్చు. మార్కెట్ డిమాండ్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, పంట కోత అనంతరం నష్టాలను తగ్గిస్తూ, పొలం నుంచి వంటశాల వరకు వ్యవసాయ గొలుసును పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో పండించే పంటలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. తద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించడంతోపాటు గ్రామీణ యువతీ యువకులకు ఉపాధి కల్పన జరుగుతుంది. ఆహార ఉత్పత్తుల ఎగుమతి ద్వారా దేశ ఆర్థికరంగం బలోపేతం అవుతుంది. ఆహార ఉత్పత్తుల వృథాను తక్షణమే తగ్గించడానికి పబ్లిక్, ప్రైవేట్ ఒప్పందాల ద్వారా మెరుగుపరచడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ మేరకు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార దినోత్సవం ఆహార భద్రత కోసం కృషి చేయాలని ఆశిద్దాం.