పశ్చిమాసియా ఉద్రిక్తతలు..కనబడని పాక్ మధ్యవర్తిత్వం ప్రభావం

Spread the love

పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని గొప్పలకు పోయిన పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్ లో  జరగాల్సిన రెండో విడత చర్చలను ఇరాన్ బహిష్కరించింది. కేవలం చర్చలు విఫలం అవ్వడమే కాదు, ఇటు అమెరికా, అటు ఇరాన్.. రెండు దేశాలు కూడా పాకిస్థాన్ వైఖరిని కనిపెట్టేశాయి. 

గ్లోబల్ గా రేంజ్ పెంచుకోవాలని చూసిన జనరల్ ఆసిమ్ మునీర్ వ్యూహాలు బెడిసికొట్టాయి.  అగ్రరాజ్యం అమెరికా ఒకవైపు, మొండి పట్టు వీడని ఇరాన్ మరోవైపు పాకిస్థాన్‌ ను తీసిపారేయడంతో ఇస్లామాబాద్ పరిస్థితి కామెడీ అయిపోయింది. మొదటి దశ చర్చలు విఫలమైనా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన పాకిస్థాన్‌కు రెండో దశ చర్చల్లో పాల్గొనబోమని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ఇటు అమెరికా నిఘా సంస్థలు కూడా పాక్ ట్రాప్‌లో పడొద్దని ట్రంప్ సర్కార్‌ ను హెచ్చరించడంతో మధ్యవర్తిత్వం అటకెక్కింది. రెండు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాక్ తన స్వప్రయోజనాల కోసం ఆడుతున్న నాటకాన్ని ఇరాన్ పసిగట్టి అడుగు ముందుకు వేయడం లేదు. శాంతి అంటూ పాక్ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఆ దేశానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలన్న పాక్ ఆశలు అడియాశలు కావడానికి హార్మూజ్ జలసంధిలో జరిగిన ఘటనే ప్రధాన కారణం. అమెరికా నేవీ ఇరాన్‌కు చెందిన కార్గో షిప్‌ను సీజ్ చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అమెరికాకు ఇరాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం చెప్పింది. కాల్పుల విరమణ గడువు ముగియక ముందే అమెరికా ఇలాంటి చర్యకు పాల్పడటం ఇరాన్‌ కు ఆగ్రహం తెప్పించింది. దీన్ని ‘సముద్రపు దొంగతనం’గా అభివర్ణించడమే కాక ఇరాన్ చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసింది. తమ ఆస్తులను విడుదల చేయకుండా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అటు అమెరికా పంతం ఇటు ఇరాన్ పౌరుషం మధ్యలో పాకిస్థాన్ ఇది ఇప్పుడు పరిస్థితి. సముద్ర జలాల్లో జరిగిన ఈ ఘర్షణ పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది. 

అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు బలపరుచుకునేందుకు  పాక్ ఈ చర్చలను ఒక అవకాశంగా భావించింది. అటు అరబ్ దేశాల ముందు కూడా తన హావా నిరూపించుకోవాలని జనరల్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. అయితే  అమెరికా తన మొండివైఖరిని వీడకపోవడంతో పాక్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు ఇరాన్ కూడా పాకిస్థాన్ ద్వంద్వ నీతిని గమనించి దూరంగా ఉంటోంది. పాక్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ డబుల్ గేమ్ ఆడుతోందని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనివల్ల ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత చర్చలు కాస్తా రద్దయ్యాయి. ఆసిమ్ మునీర్ వేసిన ప్లాన్ రివర్స్ కావడంతో పాక్ ఇప్పుడు ముఖం చాటేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతర్జాతీయ దౌత్యం అంటే కేవలం మాటలు కాదని పాక్‌కు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ చర్చలు ఫెయిల్ అవడానికి రెండు దేశాల మధ్య ఉన్న కఠినమైన డిమాండ్లే కారణం. ఇరాన్ తన యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా పట్టుబడుతోంది. హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ చమురు సరఫరా కోసం బేషరతుగా తెరిచి ఉంచాలని కోరుతోంది. ఇరాన్ మాత్రం తన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఆంక్షలను ఎత్తివేయాలని అంటోంది. విదేశాల్లో ఫ్రీజ్ చేసిన  తమ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని కోరుతోంది. రెండు దేశాలు ఒకదానిపై మరొక దానికి నమ్మకం లేకపోవడం దూరాన్ని మరింత పెంచుతోంది. అమెరికా పెడుతున్న నిబంధనలు ఇరాన్ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తున్నాయని ఇరాన్  భావిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ చేస్తున్న ప్రతిపాదనలు రెండు దేశాలకు ఆమోదయోగ్యంగా ఉండడం లేకే చర్చలు ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా అమెరికా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడంపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది.  అమెరికా పెడుతున్న నిబంధనలను వారు అంగీకరించడం లేదు. ఇరాన్ సైనిక విభాగం కూడా అమెరికాతో చర్చలు వద్దని గట్టిగా చెబుతోంది. పశ్చిమాసియాలో అమెరికా సైనిక కదలికలు తమకు ముప్పుగా పరిణమిస్తాయని ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు పెద్దగా ఉపయోగకరంగా ఉంటాయని వారు భావించడం లేదని తెలుస్తోంది. అమెరికా తన వైఖరి మార్చుకోనంత వరకు వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. తన పట్టు నిరూపించుకోవాలని చూసిన పాక్ ఆర్మీ ఇప్పుడు డిఫెన్స్ లో  పడిపోయింది.  సొంత దేశంలోనే సమస్యలతో సతమతమవుతున్న  పాక్, ప్రపంచానికి శాంతి పాఠాలు చెప్పడం హాస్యాస్పదంగా మారిందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.  ప్రపంచ దేశాల హెచ్చరికలను అమెరికా, ఇరాన్ పట్టించుకోవడం లేదు. మొత్తానికి పాకిస్థాన్ ఆడిన డ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *