చెన్నైలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఎన్డీయే కీలక భాగస్వామి, టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కొత్త సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేదని అయితే ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా సీట్ల సంఖ్య పెరిగితే, దానిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వచ్చేవి. దీనికన్నా మంచి ఫార్ములా మరొకటి ఉంటే, విపక్షాలు చెప్పాలని ప్రశ్నించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించిన సంగతి తెలిసిందే. డీఎంకే పాలనలో తమిళనాడు అభివృద్ధి కుంటుపడిందని డబులింజన్ సర్కార్ తోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. దేశానికి ప్రధాని మోడీ లాంటి సమర్ధవంతమైన నాయకత్వం ఉందన్నారు. సరైన సమయంలో మంచి ఆలోచన చేయాలని ప్రజలను కోరారు. సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. తమిళనాడు పునర్వైభవం ఎన్డీఏ అధికారంలోకి వస్తేనేనని పేర్కొన్నారు. కోయంబత్తూర్, చెన్నైలోని అన్నా నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన ప్రచారానికి భారీ స్పందన లభించింది.