ఇది నయా భారత్…దౌత్యంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రగతిని సాధించింది. ముఖ్యంగా ప్రధాని మోదీ పాలనలో దౌత్యపరంగా ఎంతో కీలక స్థాయికి చేరిందనేది సర్వత్రా విదితమే. తాజాగా మరోసారి అంతర్జాతీయంగా కీలక పర్యటనను చేపట్టారు. గల్ఫ్ సంపన్న దేశం యూఏఈతో పాటు ఐరోపాలోని నెదర్లాండ్స్.. స్వీడన్.. నార్వే.. ఇటలీ దేశాలు ఈ దౌత్య ప్రయాణంలో భాగమయ్యాయి. భారీ పెట్టుబడుల వ్యూహాలు ఈ పర్యటనలో ప్రధానాంశాలుగా నిలిచాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో భారతదేశ దౌత్య సత్తాను ప్రధాని మోదీ ప్రపంచానికి చూపించారు. యూఏఈ గగనతలంలో భారత ప్రధాని విమానానికి లభించిన సైనిక గౌరవం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. భారీ స్థాయిలో నలభై ఏడు వేల కోట్ల పెట్టుబడులు.. సూపర్ కంప్యూటర్ ఒప్పందాలు ఈ పర్యటనలో కుదిరాయి. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలి అడుగు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై పడింది. కేవలం గగనతలంలోనే కాదు కింద విమానాశ్రయంలో కూడా భారత ప్రధానికి సరికొత్త ప్రోటోకాల్ స్వాగతం ఎదురైంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోదీకి ఘనస్వాగతం పలికారు.ఈ ఆత్మీయ ఆలింగనం ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ కాలపు బలమైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచింది. ప్రధాని పర్యటన ఆరంభం నుంచే భారత్ తన స్పష్టమైన వ్యూహాత్మక ధోరణిని ప్రపంచ దేశాల ముందు ప్రదర్శించింది ఈ ఘన స్వాగతంతోనే మోదీ ఐదు దేశాల పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా మొదలైంది. అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు అత్యంత వేగంగా , ఆసక్తికరంగా సాగాయి. గతంలో యూఏఈపై జరిగిన ఉగ్ర దాడులను ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ఖండించి తన నిరసనను వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్న మిత్రుడికి తోడుగా నిలబడాలనే ఉద్దేశంతో యూఏఈ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు మోదీ సంఘీభావం ప్రకటించారు. ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటే అది ప్రపంచ శాంతికే ముప్పుగా మారుతుందని మోదీ తన ప్రసంగంలో స్పష్టం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని.. అయితే ఉగ్రవాద చర్యలను ఏమాత్రం సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని మోదీ ప్రకటించారు. భారత్, యూఏఈ దేశాలు కలిసి సముద్ర రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్యం చేసుకునే అన్ని దేశాలకు పెద్ద ఊరట లభించినట్లయింది. సముద్ర భద్రతపై మోదీ తీసుకున్న ఈ చొరవ ఆయన వ్యూహాత్మక ఆలోచనా సరళికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాణిజ్య మార్గాలను రక్షించడంలో భారత్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. దీనివల్ల హిందూ మహాసముద్ర ప్రాంతంతో పాటు గల్ఫ్ తీరంలో కూడా భారత్ ఇమేజ్ భారీగా పెరిగింది.
ప్రధాని మోదీ చర్చల ఎజెండాలో ఇంధన భద్రతకే అత్యధిక ప్రాధాన్యత లభించిందని దౌత్య వర్గాలు వెల్లడించాయి. భారతదేశం వంటి భారీ జనాభా గల దేశానికి భవిష్యత్తులో ఇంధన కొరత రాకుండా ఉండాలంటే గల్ఫ్ దేశాల సహకారం ఎంతో అవసరం. భవిష్యత్తు అవసరాలను గుర్తించి మోదీ ఇంధన ఒప్పందాలు చేసుకున్నారు. పెట్రోలియం నిల్వలపై వ్యూహాత్మక సహకార ఒప్పందంతో పాటు.. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల ఏర్పాటుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో అత్యవసర సమయాల కోసం భారీగా చమురు నిల్వలను భద్రపరుచుకునే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కలిసి పనిచేయాలని ఇరు దేశాల ప్రతినిధులు ఒక ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా.. తగ్గినా భారత్‌కు నిరంతరాయంగా ఇంధన సరఫరా జరిగేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. మోదీ పర్యటనతో భారత్‌లో ఏకంగా 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ దేశం ముందుకు వచ్చింది. దాదాపు 47 వేల కోట్ల రూపాయల భారీ నిధులు మన దేశంలోకి రానున్నాయి. ప్రధాని మోదీ పర్యటన భారతదేశ ఆర్థిక ప్రగతికి ఎంతటి మేలు చేసిందో ఈ పెట్టుబడుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ శాఖ అధికారులు సంతకాలు చేశారు. సైనిక రంగానికి సంబంధించిన సరికొత్త ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతపై ఉమ్మడిగా సహకరించుకోనున్నారు. ఇరు దేశాల సైనికులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పాటు.. సముద్రంలో సంయుక్త విన్యాసాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అత్యంత ప్రమాదకరంగా మారిన సైబర్ సెక్యూరిటీ అంశంపై కూడా ఇరు దేశాలు దృష్టి సారించాయి. సరిహద్దు భద్రతతో పాటు అంతర్గత భద్రతను కాపాడుకోవడంలో ఈ రక్షణ ఒప్పందం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. సాంకేతిక రంగంలో భారత్‌కు చెందిన సీడాక్ సంస్థ.. యూఏఈకి చెందిన ప్రముఖ జీ-42 సంస్థతో చారిత్రాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు ప్రతిష్టాత్మక సంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో 8 ఎక్సాఫ్లాప్ సామర్థ్యం కలిగిన భారీ సూపర్ కంప్యూట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సూపర్ కంప్యూటర్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అలాగే కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ సంస్థ.. దుబాయ్‌కు చెందిన డ్రైడాక్స్ వరల్డ్‌తో రెండు కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రధాని మోదీ దౌత్య పర్యటన కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా.. సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలికిందనేది సుస్పష్టం. గల్ఫ్ దేశమైన యూఏఈలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అత్యంత విజయవంతంగా.. ఆశించిన ఫలితాలతో ముగిసింది. యూఏఈ పర్యటన ముగించుకుని మోదీ నెదర్లాండ్స్.. స్వీడన్ దేశాల వైపు తన ప్రయాణాన్ని సాగించారు. అక్కడి నుండి నార్వే , ఇటలీ దేశాలలో కూడా ఆయన పర్యటించి పలు అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఐదు దేశాల ఈ సుదీర్ఘ దౌత్య పర్యటన ఈనెల 20న ముగియనుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.