ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా పరిస్థితి ఏంటి?

Spread the love

ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కొత్త ముఖం అసలు ఉందా? లేక తెర వెనుక ఏదో తెలియనిది  జరుగుతోందా? ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టాల్సిన వ్యక్తి, పదవి దక్కిన వారం రోజులైనా ప్రపంచం కంట పడకపోవడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇరాన్ సింహాసనంపై కూర్చున్న ఆ ‘వారసుడు’ క్షేమంగా ఉన్నారా? లేక మృత్యువుతో పోరాడుతున్నారా?

ఇరాన్ గడ్డపై ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మోగుతోంది. ఆయనే మోజ్తాబా ఖమేనీ. ఇరాన్ అత్యున్నత నాయకుడిగా ప్రకటించబడినా వారం రోజులుగా గది దాటి బయటకు రాలేదు. పరోక్షంగా కూడా కనిపించలేదు. ఇది ఇరాన్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో వారసత్వ పాలనకు చరమగీతం పాడారు. కానీ, 37 ఏళ్ల పాటు పాలించిన అలీ ఖమేనీ మరణం తర్వాత, మళ్ళీ ఆయన కుమారుడికే పగ్గాలు అప్పగించడం అక్కడ సంచలనంగా మారింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఈ ఎంపిక చేయాలి. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించగా, మార్చి 9న మోజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించారు. తండ్రి తర్వాత కొడుకు పదవిని చేపట్టడం ఇరాన్ చరిత్రలో ఇదే తొలిసారి.

అంతర్జాతీయ సమాచారం ప్రకారం, కొత్త నాయకుడు ఎక్కడున్నారనే దానిపై మూడు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. గాయపడ్డారా?: తన తండ్రిపై జరిగిన వైమానిక దాడుల్లో మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన బయటకు రావడం లేదని బలమైన ప్రచారం జరుగుతోంది. స్టేట్ మీడియా ఆయనను యుద్ధంలో గాయపడిన యోధుడు అని సంబోధించడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది.ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యం మోజ్తాబానే అని ప్రకటించిన నేపథ్యంలో, ఆయనను రహస్య బంకర్లలో ఉంచి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ఎన్నికను దేశంలోని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిన ఈ నియామకంపై లోలోపల నిరసనలు వ్యక్తమవుతున్నాయని సమాచారం. అయితే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కొందరు, కాదు కేవలం తన తండ్రి మరణం నుంచి కోలుకోలేదని మరికొందరు విశ్లేషిస్తున్నారు. అయితే,  ఆయన పేరుతో ఒక మెసేజ్ విడుదలైంది. అందులో ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగుతుందని, హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించారు. కానీ, ఆ సందేశం మోజ్తాబా రాసిందేనా? లేక ఐఆర్జీసీ  అధికారులు రాసి ఆయన పేరు వాడుకున్నారా? అన్నది మిస్టరీగా మారింది.తెహ్రాన్ వీధుల్లో మోజ్తాబా ఫోటోలతో భారీ బ్యానర్లు వెలిశాయి. కానీ, ప్రజల్లో మాత్రం మిశ్రమ స్పందన ఉంది. కొందరు ఆయనను తండ్రికి తగ్గ వారసుడిగా చూస్తుంటే, మరికొందరు ‘వారసత్వ పాలన వద్దు’ అంటూ నిరసన తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు ఈ నియామకాన్ని తప్పుబడుతూ, “ఇది ఇరాన్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని అంటున్నారు. ఇరాన్ పగ్గాలు చేపట్టడం పెను సవాలే.. శత్రువుల దాడులు ఒకవైపు, ప్రజల అసంతృప్తి మరోవైపు. ఫిబ్రవరి 28, 2026. ఇరాన్ చరిత్రలో ఒక మరపురాని రోజు. అమెరికా,  ఇజ్రాయెల్ దళాలు ఉమ్మడిగా నిర్వహించిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ ధాటికి ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడితో ఇరాన్ ఒక్కసారిగా కుప్పకూలింది. దాదాపు 36 ఏళ్ల పాటు ఇరాన్ సర్వస్వంగా వెలిగిన ఖమేనీ మరణం ఆ దేశానికి కోలుకోలేని దెబ్బ. అయితే, శత్రువుల దాడుల మధ్యే మార్చి 8న అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపిక చేస్తూ ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నిర్ణయం తీసుకుంది. అయితే పగ్గాలు చేపట్టిన వెంటనే మోజ్తాబా మీడియా ముందుకు వస్తారని, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. కానీ, రోజులు గడుస్తున్నా ఆయన ఆచూకీ లేదు. గొంతు విప్పలేదు. ఈ మౌనం వెనుక ఏదో ప్రమాదం పొంచి ఉందనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం ఇరాన్ రాజకీయ వర్గాల్లో ఒక వార్త దావానలంలా వ్యాపించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, ఆ దేశ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఖమేనీని రహస్యంగా సందర్శించారన్నది ఆ వార్త సారాంశం. కేవలం మర్యాదపూర్వక భేటీ అయితే ఇంత రచ్చ జరిగేది కాదు, కానీ ఈ భేటీ జరిగింది టెహ్రాన్‌లోని ప్రఖ్యాత సినా ఆస్పత్రిలో కావడం గమనార్హం.సాధారణంగా ఏ దేశాధ్యక్షుడైనా బహిరంగంగా పర్యటిస్తారు. కానీ, ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచడం, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, సినా ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) ప్రస్తుతం ఒక కోటలా మారిపోయింది. అక్కడికి సామాన్యులకే కాదు, కనీసం ఆస్పత్రిలోని ఇతర సిబ్బందికి కూడా ప్రవేశం లేదు. కేవలం అత్యున్నత స్థాయి అధికారం కలిగిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ పరిణామం మోజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.మోజ్తాబా ఖమేనీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అయతొల్లా అలీ ఖమేనీ తర్వాత దేశ బాధ్యతలు చేపట్టబోయే వారసుడిగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అటువంటి వ్యక్తి ఐసీయూలో ఉండటం, అదీ అధ్యక్షుడి సందర్శన తర్వాత వార్తలు బయటకు రావడం ఇరాన్ అంతర్గత భద్రత మరియు రాజకీయ స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.ఏదైనా ఒక పెద్ద వార్త బయటకు వచ్చినప్పుడు, ప్రభుత్వం వెంటనే స్పందించి క్లారిటీ ఇవ్వడం సహజం. కానీ ఇరాన్ విషయంలో అది జరగడం లేదు. మోజ్తాబా ఆరోగ్యంపై సోషల్ మీడియాలో, వందలాది కథనాలు వస్తున్నా, ఇరాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ప్రభుత్వ మౌనం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? మోజ్తాబా ఆరోగ్య పరిస్థితి నిజంగానే విషమంగా ఉందా? లేక రాజకీయంగా ఏదైనా పెద్ద మార్పు జరగబోతుందా? అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.  ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ పరిస్థితిపై ఇప్పుడున్న సస్పెన్స్ మరికొద్ది రోజుల్లో వీడే అవకాశం ఉంది. ఆయన నిజంగానే ‘గాయపడిన యోధుడా’ లేక కేవలం ఒక సాధారణ నేతగా మిగిలిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *