అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రఖ్యాత బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BITS) పిలాని ఏఐ ప్లస్ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు పరిశీలించారు. బిట్స్ ప్రతినిధులు సిద్ధార్థ బెనర్జీ, ఎన్.చెన్నవీర్, బీఎస్ సహాని నేడు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ ఏఐ క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు తెలిపారు. ఇక నిర్మాణంలో గ్రీన్ బిల్డింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి ఎన్నివిరాన్మెంట్ ఫ్రెండ్లీ విధానాలను పాటిస్తున్నట్లు తెలిపారు. అమరావతి బిట్స్ దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ గా ఉండబోతోందని అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో పాటు అగ్రికల్చర్ నుండి వాతావరణం, ఆరోగ్య సంరక్షణ వంటి కోర్సులు కూడా ఇక్కడ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దశల్లో 7వేల మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ క్యాంపస్ పై వచ్చే ఐదేళ్లలో వెయ్యికోట్ల పెట్టుబడి పెడతామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా అమరావతి క్యాంపస్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.