ఇరాన్  ‘సీమైన్స్’ పద్మవ్యూహం…వణుకుతున్న అమెరికా నౌకలు!

Spread the love

మిడిల్ ఈస్ట్ లో గత కొద్ది రోజులుగా రగులుతున్న పరిస్థితుల గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన చమురు కళ్లముందే ఉన్నా, దానిని అడ్డుకుంటూ హర్మూజ్ జలసంధిని ఇరాన్ శత్రుదుర్బేధ్యంగా మార్చుతోంది. అమెరికాకు  సవాల్ విసురుతూ సముద్ర గర్భంలో ఇరాన్ ఒక రేంజ్ లో సెటప్ చేసింది.  ‘సీమైన్స్’ పద్మవ్యూహం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే గండంగా మారింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాలను తీర్చే కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు యుద్ధ పరిస్థితులలో ఉంది. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ పన్నుతున్న ‘సీమైన్స్’  వ్యూహం అమెరికా లాంటి అగ్రరాజ్యానికే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వరల్డ్ మ్యాప్ లో  ఒక చిన్న గీతలా కనిపించే ‘హర్మూజ్ జలసంధి’  భూగోళం మీద ఉన్న అత్యంత వ్యూహాత్మక జల మార్గాల్లో ఒకటి. ఒకవైపు పర్షియన్ గల్ఫ్, మరోవైపు ఓమన్ గల్ఫ్.. ఈ రెండింటినీ కలిపే ఈ సన్నని దారి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. దీనికి ఉత్తరాన ఇరాన్ ఉంటే, దక్షిణాన ఒమన్, యూఏఈ  దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. భౌగోళికంగా చూస్తే ఇది కేవలం 33 నుండి 39 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ, ఇందులో షిప్ లు ప్రయాణించడానికి వీలైన మార్గంకేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండటం గమనార్హం.

ఎందుకు ఈ జలసంధి ప్రపంచానికి ప్రాణవాయువు లాంటిదంటే.. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో దాదాపు 20% నుండి 30% వరకు కేవలం ఈ చిన్న మార్గం గుండానే రవాణా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యూఏఈ వంటి అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి దేశాల ఎగుమతులన్నీ ఈ దారి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ చిన్న ఆటంకం కలిగినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి.  ఈ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగితే, చమురు దిగుమతి చేసుకునే దేశాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రస్తుతం ఇరాన్ సరిగ్గా ఇదే పాయింట్‌ను టార్గెట్ చేస్తోంది. అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ తన పాత వ్యూహానికి పదును పెట్టింది. అదే ‘సీమైన్స్’ వ్యూహం.

సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా వేచి ఉండే ఈ మైన్స్. ఇరాన్ తన వద్ద ఉన్న అడ్వాన్స్డ్ మైన్స్ ను  జలసంధిలోని కీలక పాయింట్ల వద్ద అమర్చుతున్నట్లు సమాచారం. అమెరికా , దాని మిత్రదేశాల నౌకలను అడ్డుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక భారీ యుద్ధనౌక లేదా చమురు ట్యాంకర్ ఈ మందుపాతరను తాకితే, క్షణాల్లో ఊహించని నష్టం జరుగుతుంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పరిణామాలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా నేవీ  ఇప్పటికే ఆ ప్రాంతంలో గస్తీ పెంచినప్పటికీ, సముద్ర గర్భంలో దాగి ఉన్న ఈ ముప్పును గుర్తించడం అంత సులభం కాదు. ఇరాన్ తన ప్రాదేశిక జలాల మీద ఉన్న పట్టును ఉపయోగించుకుని, వ్యూహాత్మకంగా ఈ మైన్స్‌ను మోహరిస్తోంది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ఒక రకమైన ఆర్థిక యుద్ధం కూడా. జలసంధిని మూసివేస్తామని ఇరాన్ నేరుగా హెచ్చరించకపోయినా, ఈ మందుపాతరల మోహరింపు ద్వారా పరోక్షంగా ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెడుతోంది. ఇంధన సరఫరా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శత్రువుల నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ పన్నుతున్న ‘సీమైన్స్’ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద సుమారు 2,000 నుండి 6,000 వరకు శక్తివంతమైన సీమైన్స్ ఉన్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన ‘సీమైన్స్’ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. సముద్ర మార్గంలో అడ్డంకులుగా మారిన సీమైన్స్‌ను వెంటనే తొలగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. ఈ క్రమంలోనే సీమైన్స్ అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసింది. అయినప్పటికీ, ఇరాన్ ‘మొజాయిక్’ వ్యూహంతో దాడులు కొనసాగిస్తోంది. చమురు రవాణా నిలిచిపోతే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలుతుందనే భయం అగ్రరాజ్యాల్లో మొదలైంది. పరిస్థితి చేయి దాటిపోకముందే అంతర్జాతీయ సమాజం దీనికి ఒక పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉంది. మరి ట్రంప్ సర్కార్ ఈ పరిస్థితిని ఎలా అధిగమిస్తుంది.  ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా కాపాడుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *