మిడిల్ ఈస్ట్ పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం విదేశీయులకు ఉపశమనం కలిగించే విధంగా నిర్ణయం తీసుకుంది. వార్ వలన ఫ్లైట్స్ కు అంతరాయం ఉండడంతో భారత్ లో చిక్కుకుపోయిన విదేశీయుల కోసం వీసా గడువును పెంచడమే కాక జరిమానాల మినహాయింపును ప్రకటించింది. దుబాయ్ లోని భారత కాన్సులేట్ వెల్లడించిన వివరాల ప్రకారం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా భారతదేశంలో చిక్కుకుపోయిన విదేశీయులకు రెగ్యులర్ ఇండియన్ వీసా/ఇ-వీసా పొడిగింపు మరియు ఓవర్ స్టే జరిమానా మినహాయింపుకు సంబంధించిన సమాచారం ఈ విధంగా తెలిపింది. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరలో గడువు ముగియనున్న లేదా ఇప్పటికే ముగిసిన అన్ని రకాల వీసాలు/ఇ-వీసాలను, ప్రభావిత దేశాలకు చెందిన పౌరులకు ఆయా పరిధిలోని FRROల ద్వారా కేసును బట్టి ఒక నెల పాటు ఉచితంగా పొడిగించడం జరుగుతుందని తెలిపింది. మిడిల్ ఈస్ట్ పరిణామాల కారణంగా ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎవరైనా విదేశీయులు గడువు ముగిసినా ఇక్కడే ఉండాల్సి వస్తే (Overstay), వారికి విధించే జరిమానాను రద్దు చేయడం జరుగుతుందని పేర్కొంది. ప్రభావిత విదేశీ పౌరులకు ఎగ్జిట్ పర్మిట్లను ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా జారీ చేస్తారు.ప్రభావిత విదేశీయులు ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోయినా లేదా వీసా పొడిగింపు చేసుకోకపోయినా, దానిని వలస చట్టాల ఉల్లంఘనగా పరిగణించరు. విమానాల దారి మళ్లింపు కారణంగా భారతదేశానికి చేరుకునే విదేశీ పౌరులకు ‘టెంపరరీ ల్యాండింగ్ పర్మిట్’ను ఉచితంగా మంజూరు చేస్తారు.