అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో నెల రోజులకు పైగా మిడిల్ ఈస్ట్ లో యుద్దవాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇరు దేశాలు సీజ్ ఫైర్ కు అంగీకరించాయి. ఇక ఈ తాజా పరిణామాలపై భారత్ స్పందించింది. ఈ నిర్ణయంతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని విదేశాంగ శాఖ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. పశ్చిమ ఆసియాలో కుదిరిన కాల్పుల విరమణను మేము స్వాగతిస్తున్నాము ఈ తాజా నిర్ణయం అక్కడ శాశ్వత శాంతికి దారితీస్తుందని ఆశిస్తున్నాము. మేము గతంలో నిరంతరం ప్రతిపాదించినట్లుగా, కొనసాగుతున్న ఈ సంఘర్షణకు త్వరితగతిన ముగింపు పలకడానికి ఉద్రిక్తతల తగ్గింపు, చర్చలు మరియు దౌత్యం చాలా అవసరమని పేర్కొంది. ఈ సంఘర్షణ ఇప్పటికే ప్రజలకు అపారమైన బాధను కలిగించింది మరియు ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లను దెబ్బతీసిందని హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా నిరంతరాయమైన నౌకాయాన స్వేచ్ఛ మరియు ప్రపంచ వాణిజ్య కార్యక్రమాలు కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. దాదాపుగా 40 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య జరిగిన పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రత సహా కీలక అంశాలపై ఆందోళన వ్యక్తమైంది. ఇక ప్రస్తుతం కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఆయిల్ సరఫరాకు కీలకమైన హార్మోజ్ ను తిరిగి తెరిచేందుకు, కాల్పుల విరమణకు ఇరాన్ కూడా అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.