వచ్చే ఏడాది ఈ సమయానికి మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి ఇప్పటికే టాలీవుడ్ సహా ప్రపంచ సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. చిత్రబృందం అధికారికంగా వెల్లడించిన ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఆ తేదీని గుర్తు చేస్తూ చిత్రబృందం సోషల్ మీడియాలో ఒక క్రియేటివ్ పోస్ట్ పెట్టింది. “ఒక వేళ మనం కాలయానం చేసి ఒక సంవత్సరం ముందుకు వెళ్తే, ఈ సమయానికి మనం ‘వారణాసి’ సినిమాను థియేటర్‌లో చూస్తుంటాం. ఇట్స్ షో టైమ్” అని వారు రాసిన సందేశం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఆమె పాత్ర పేరు మందాకిని. మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించనున్నారు. మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్ కు తోడు ఈ స్థాయిలో భారీగా సినిమా తెరకెక్కుతుండటం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించే సినిమా అవుతుందనే అంచనాలున్నాయి. వెయ్యి కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశముందని సినీ విశ్లేషకులు అంటున్నారు.