ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులకు భంగం వాటిల్లడం కొనసాగుతూనే ఉంది. 2021లో అధికారాన్ని చేజిక్కించుకున్న నాటి నుంచి నేటి వరకు తాలిబన్లు అక్కడి ఆడబిడ్డల హక్కులను కాలరాస్తూనే ఉన్నారు. కనీస ప్రాథమిక హక్కులైన చదువును దూరం చేశారు.. ఉద్యోగాలను లాగేసుకున్నారు.. కనీసం ఒంటరిగా బయటకు వచ్చే స్వేచ్ఛను కూడా హరించారు. ఇప్పుడు అంతకంటే దారుణమైన, అత్యంత కిరాతకమైన మరో చట్టాన్ని తీసుకువచ్చారు. తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా ఆమోదించిన ఈ కొత్త చట్టం.. తుపాకీ నీడలో బతుకుతున్న అమాయక బాలికల మౌనాన్ని ‘పెళ్లికి అంగీకారం’గా మార్చేసింది. మొత్తం 31 ఆర్టికల్స్‌తో కూడిన ఈ వివాదాస్పద చట్టంపై అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దీనిని ‘లైంగిక వర్ణ వివక్ష’గా అభివర్ణిస్తున్నారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక పెళ్లికాని అమ్మాయి భయంతో మౌనంగా ఉంటే, ఆ మౌనాన్నే అంగీకారంగా భావించి పెళ్లి చేయవచ్చని ఈ చట్టం చెబుతోంది. వినడానికే ఇది అత్యంత కిరాతకంగా ఉంది. ఈ వివాదాస్పద చట్టంపై అంతర్జాతీయ సమాజం మండిపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు దీనిని ఘోరమైన వివక్షగా అభివర్ణిస్తున్నాయి.
ఒకే చట్టంలో స్త్రీలకు ఒక న్యాయం, పురుషులకు ఒక న్యాయం ఉంచడం వారి పక్షపాత వైఖరికి నిదర్శనం. ఒక అబ్బాయి లేదా ఇదివరకే పెళ్లయిన మహిళ పెళ్లి విషయంలో మౌనంగా ఉంటే దానిని అంగీకారంగా పరిగణించరు. కానీ అదే ఒక మైనర్ లేదా అవివాహిత బాలిక మౌనంగా ఉంటే మాత్రం పెళ్లికి సమ్మతించినట్లేనని చెల్లుబాటు చేస్తారు. ఈ నయా చట్టం ద్వారా తండ్రి , తాతలకు మైనర్ బాలికల వివాహాలపై అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా, తండ్రి లేదా తాత కాకుండా ఇతర బంధువులు పెళ్లి నిశ్చయించినా అది సామాజికంగా అనుకూలంగా ఉంటే సరిపోతుందని ఆర్టికల్ ఐదులో పొందుపరిచారు. తాలిబన్ల ఈ కిరాతక చట్టంపై ఇస్లామిక్ మేధావులు , రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర ఖురాన్ ఎప్పుడూ మహిళలపై బలవంతాన్ని లేదా ఎలాంటి వేధింపులను అంగీకరించదని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రముఖ విశ్లేషకురాలు ఫహీమా మహ్మద్ తాలిబన్ల అనాగరిక వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాల్య వివాహం అనేది ఏ రకంగానూ సరైన వివాహం కాదని, అది ఇస్లాం సూత్రాలకు పూర్తి విరుద్ధమని ఆమె అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల పరిస్థితి రోజురోజుకూ అత్యంత దయనీయంగా తయారవుతోంది. బాలికలకు ఆరో తరగతి దాటిన తర్వాత చదువుకునే హక్కును ఈ పాలకులు ఎప్పుడో లాగేసుకున్నారు. మహిళలు విశ్వవిద్యాలయాలకు వెళ్లడంపై, ఉద్యోగాలు చేయడంపై ఇప్పటికే పూర్తి నిషేధం ఉంది. ఒంటరిగా ప్రయాణించడం లేదా బహిరంగ ప్రదేశాలకు రావడం వంటి కనీస హక్కులను కూడా కాలరాశారు. ఇప్పుడు కొత్తగా తెచ్చిన వివాహ చట్టం ద్వారా వారి మనుగడనే ప్రశ్నార్థకం చేశారు. ఆఫ్ఘన్ స్త్రీల కన్నీటి గాథలు ప్రపంచ మానవ హక్కుల చరిత్రలో ఒక నల్లటి అధ్యాయంగా మిగిలిపోనున్నాయి. ఈ ఘోరాలపై ప్రపంచ దేశాలు కేవలం నిరసనలతోనే సరిపెడుతున్నాయి. మానవ హక్కుల సంఘాలు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆఫ్ఘన్ మహిళల రక్షణ కోసం ప్రపంచం అంతా ఏకతాటిపైకి వచ్చి పోరాడకపోతే మానవత్వానికే పెద్ద ముప్పు వాటిల్లుతుంది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్యసమితి కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా.. ఆఫ్ఘన్ మహిళల రక్షణ కోసం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్వత్రా వినిపిస్తోంది.