బంగ్లాదేశ్ లో రాజకీయ సెగలు భారత్ తో ప్రస్తుతం నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనున్న గంగా జలాల ఒప్పందం పొరుగు దేశం పాలిట శాపంగా మారబోతోందా? అనే చర్చ వినిపిస్తోంది. భారత్ పై అక్కసు వెళ్లగక్కుతున్న బంగ్లాదేశ్ పాలకుల మైండ్ గేమ్ ను చిత్తు చేసేందుకు ఢిల్లీ వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేస్తోందా? ఇక బంగ్లాదేశ్ లో భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారం ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల లబ్ధి కోసం ప్రతిపక్షాలు భారత్ ను టార్గెట్ చేస్తూ ఓట్లను అడుక్కుంటున్న సంగతి విదితమే. ఈ విద్వేష రాజకీయాలు రెండు దేశాల మధ్య దశాబ్దాల మైత్రిని దెబ్బతీసే ప్రమాదం కనిపిస్తోంది
తీవ్రవాద భావజాలం ఉన్న జమాతే ఇస్లామి వంటి పార్టీలు సరిహద్దుల్లో పెచ్చరిల్లుతున్నాయి. పొరుగు దేశంలో రేగుతున్న ఈ అస్థిరత భారత్ సరిహద్దు భద్రతకు పెను సవాలుగా మారుతోంది. కానీ బంగ్లాదేశ్ పాలకుల కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత్ వద్ద తగిన అస్త్రాలు రెడీగానే ఉన్నాయి. ఆర్థిక , పర్యావరణ లీవరేజ్‌తో ఈ సంక్షోభాన్ని భారత్ సమతుల్యం చేయగలదని విశ్లేషకుల అభిప్రాయం. రాజకీయాలు ఎలా ఉన్నా భారత్ తో సత్సంబంధాలు లేకపోతే ఆర్థిక రంగమైనా, అంతర్జాతీయ వాణిజ్యమైనా బంగ్లాదేశ్ కు గడ్డుపరిస్థితులు తప్పవు. ఆ దేశ మనుగడకు భారత్ సహకారం ఎంతో కీలకం. ముఖ్యంగా రెండు దేశాలకు అత్యవసరమైన జల వనరుల పంపిణీపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ముప్పై ఏళ్ల క్రితం 1996లో దేవేగౌడ, షేక్ హసీనా ప్రభుత్వాల మధ్య కుదిరిన గంగా జలాల ఒప్పందం ఇప్పుడు మరికొన్ని నెలల్లోనే పూర్తవబోతోంది. రెండు దేశాల సహకారానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ఒప్పందం 2026 డిసెంబర్ తో ముగిసిపోనుంది. ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఈ ఒప్పందం పునరుద్ధరణపై సందిగ్ధత నెలకొంది. భారత్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు ఇరు దేశాల నీటి లభ్యత ముడిపడి ఉంది. ఈ జలాల ఒప్పందంపైనే ఇరు దేశాల దౌత్య సంబంధాల పటిష్టత ఆధారపడి ఉంది.
ఒకవేళ గంగా జలాల ఒప్పందం కనుక తిరిగి కొనసాగకపోతే బంగ్లాదేశ్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. భారత్ నుంచి ప్రవహించే 100కు పైగా నదులే బంగ్లాదేశ్ వ్యవసాయానికి, పారిశ్రామిక రంగానికి ప్రాణాధారం. ఈ నదుల నీటి ప్రవాహాన్ని భారత్ కనుక కంట్రోల్ చేస్తే ఆ దేశ పరిస్థితి దారుణంగా మారుతుంది. గతంలో పాకిస్తాన్‌తో జరిగిన సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొందో ప్రపంచం చూసింది. కరువులు, అకాల వరదలతో పాకిస్తాన్ పాలకులు చేసిన తప్పుకు ఆ దేశ ప్రజలు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. బంగ్లాదేశ్ కు కూడా అటువంటి పరిణామాలు తప్పవు. భారత్‌ను శత్రువుగా చూస్తే బంగ్లా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. ఈ సంక్షోభాన్ని భారత్ ఒక అద్భుతమైన దౌత్య అవకాశంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కొత్త గంగా ఒప్పందంలో కఠినమైన నిబంధనలు విధించేందుకు న్యూ ఢిల్లీకి అన్ని హక్కులూ ఉన్నాయి
బోర్డర్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం ప్రధాన అజెండాగా మార్చి భారత్ తన పట్టును నిరూపించుకోగలదు. చైనా, పాకిస్తాన్ శక్తులు బంగ్లాదేశ్‌లో జొరబడకుండా అడ్డుకునేందుకు ఈ నీటి లీవరేజ్ ఒక వెపన్ లాగా పనిచేస్తుంది. ఈ కీలక సమయంలో భారత్ తీసుకునే నిర్ణయాలు బంగ్లాదేశ్ రాజకీయాల గమనాన్ని మార్చగలవు. రాజకీయం వేరు, వాస్తవికత వేరు. ఎన్నికల్లో గెలవడం కోసం బంగ్లాదేశ్ నేతలు భారత్ ను ఎంత విమర్శించినా రేపు ఆ దేశం దుర్భర పరిస్థితులు ఎదుర్కోకూడదంటే వారికి భారత్ సహాయం తప్పనిసరి. డిసెంబర్ 2026లో ముగియబోయే గంగా జలాల ఒప్పందం అనేది కేవలం నీటి పంపిణీ మాత్రమే కాదు.. అది భారత్ చేతిలో ఉన్న ఒక వ్యూహాత్మక బ్రహ్మాస్త్రం. దీనిని ఉపయోగించి అటు సరిహద్దు భద్రతను కాపాడుకుంటూనే, ఇటు బంగ్లాదేశ్‌ను సరైన మార్గంలో పెట్టే అవకాశం భారత్‌కు ఉంది.