అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి ఇరకాటంలో పడింది. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఇరాన్‌పై కన్నెర్ర చేసిన వైట్ హౌస్, ఇప్పుడు తన సొంత నిర్ణయాలకే చింతిస్తోంది. వారం రోజుల్లో ముగుస్తుంది అనుకున్న యుద్ధం 22 రోజులు దాటినా అదే తీరున సాగుతూ సరికొత్త సంక్షోభానికి తెరలేపుతోంది.
యుద్ధం కొలిక్కి రాకపోగా, అది మరింత ముదురుతోంది. ఇరాన్ కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కు మాత్రమే పరిమితం కాకుండా, ఎదురుదాడికి దిగుతుండటం అగ్రరాజ్యాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే కొద్దీ, అమెరికా పరువుతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా ఇబ్బందికరంగా మారుతుందేమో అనే చర్చ వినిపిస్తోంది. యుద్ధం అంటే కేవలం బాంబుల మోత కాదు, అది ధన ప్రవాహం. అమెరికా ఈ 22 రోజుల్లో చవిచూసిన నష్టం సామాన్యమైనది కాదు.ఇక్కడ ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మధ్యలో దూరిన అమెరికా పరిస్థితి అలాగే ఉంది. ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థలు Center for Strategic and International Studies తెలిపిన గణాంకాలు ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన కేవలం మొదటి రెండు వారాల్లోనే అమెరికా ఏకంగా 7,520 కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది.ఆయుధాల సరఫరా ఖర్చు.గల్ఫ్ దేశాల్లో ఉన్న బేస్‌ల రక్షణ వ్యయం.ఇరాన్ క్షిపణి దాడుల వల్ల జరిగిన ఆస్తి నష్టం.ఇవన్నీ అమెరికా ఖజానాపై భారీ ప్రభావాన్నే చూపాయి. ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అది నేరుగా ఇజ్రాయెల్‌తోనే కాకుండా, గల్ఫ్ దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా మిలిటరీ బేస్ లను టార్గెట్ చేస్తోంది. అమెరికా రక్షణ వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని పేరుంది. అయితే ఇరాన్ దాడులు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. రక్షణ కవచాలు ఉన్నా కూడా ఇరాన్ క్షిపణులు అమెరికా బేస్ లను తాకుతుండటం చూస్తుంటే.. అమెరికా రక్షణ సాంకేతికతలో ఉన్న లొసుగులు బయటపడుతున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న డ్రోన్, క్షిపణి శక్తిని అగ్రరాజ్యం తక్కువ అంచనా వేసిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది కేవలం అమెరికాకే కాదు, దాని మిత్రదేశాలకు కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ యుద్ధం కేవలం ఇద్దరి మధ్య గొడవ మాత్రమే కాదు. పశ్చిమాసియాలో అస్థిరత పెరిగితే, దాని ప్రభావం నేరుగా చమురు ధరల మీద పడుతుంది. ఇరాన్ తన వ్యూహంతో ప్రపంచ చమురు సరఫరాను ప్రభావితం చేస్తోంది. ఇరాన్ గనుక హార్ముజ్ జలసంధి వంటి కీలక ప్రాంతాలను ప్రభావితం చేస్తే, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తాయి. ఇప్పటికే పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అమెరికా చేపట్టిన చర్యల వల్ల సామాన్య ప్రజలు కూడా భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి “ముందు నుయ్యి – వెనుక గొయ్యి” అన్నట్లుగా ఉంది.యుద్ధాన్ని ఇప్పుడే ఆపేస్తే.. ఇరాన్ గెలిచినట్లు అవుతుంది, అమెరికా ప్రతిష్ట మంటగలుస్తుంది.యుద్ధాన్ని కొనసాగిస్తే.. రోజుకు వేల కోట్ల నష్టం తప్పదు, పైగా చమురు సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది.
అమెరికాను కూడా ఎదిరించగల శక్తి ఇరాన్‌కు ఉందా?” అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది అమెరికా గ్లోబల్ లీడర్షిప్కు ఒక పెద్ద సవాల్. యుద్ధం అంటే కేవలం ఆయుధాల ప్రదర్శన కాదు, శత్రువు ఊహించని రీతిలో దెబ్బకొట్టడం. ఇరాన్ ఇప్పుడు సరిగ్గా అదే చేసింది. జోర్డాన్, ఇరాక్, సిరియా దేశాల్లో విస్తరించి ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సేనలు ఏకకాలంలో దాడులకు దిగాయి. అమెరికా గర్వపడే ‘ప్యాట్రియట్’ (Patriot), ‘థాడ్’ (THAAD) వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలపై ఇరాన్ తన అమ్ములపొదిలోని హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగించింది. మిస్సైల్స్ ఒకవైపు భీభత్సం సృష్టిస్తుంటే, మరోవైపు ఇరాన్ స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన ‘షాహెద్-136’ (Shahed-136) డ్రోన్లు అమెరికా సైన్యాన్నిముప్పతిప్పలు పెట్టాయి.అమెరికా టెక్నాలజీకు ఇరాన్ తన తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్ టెక్నాలజీతో చెక్ పెట్టింది. కేవలం రాడార్లను మోసం చేయడమే కాకుండా, కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో షాహెద్ డ్రోన్లు సక్సెస్ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ రక్షణ వ్యవస్థగా పేరుగాంచిన ‘థాడ్’ వ్యవస్థ సైతం ఇరాన్ హైపర్ సోనిక్ క్షిపణుల వేగాన్ని అడ్డుకోలేకపోయింది. అమెరికా గొప్పలు చెప్పుకునే సాంకేతికతకు క్షేత్రస్థాయిలో ఇరాన్ గట్టిసవాలునే విసిరింది. ఈ యుద్ధ జ్వాలలు కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ సరిహద్దులకే పరిమితం కాలేదు. జోర్డాన్ లోని ప్రధాన యూనియన్ ఈ దాడుల్లో తీవ్రంగా దెబ్బతింది. ఇది ఆ ప్రాంతంలో అత్యంత కీలకమైన కేంద్రాన్ని ధ్వంసం చేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ యూనియన్ పూర్తిగా నాశనమైంది. దీనిని తిరిగి నిర్మించి, పూర్వ స్థితికి తీసుకురావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, రాబోయే రెండు సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. ఇరాన్ దాడులు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, కేవలం రాడార్లే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న ఇతర రక్షణ పరికరాలు కూడా తునాతునకలయ్యాయి. ఈ పరికరాల విధ్వంసం కారణంగా మరో రూ. 1,800 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఇవి ఆధునిక యుద్ధ తంత్రంలో కీలకమైన కమ్యూనికేషన్ మరియు నిఘా పరికరాలు కావడం గమనార్హం.యుద్ధం అంటే కేవలం తుపాకులు, క్షిపణులు మాత్రమే కాదు.. రవాణా వ్యవస్థ కూడా. ఇరాన్ దాడుల ధాటికి అక్కడ ఉన్న సైనిక వాహనాలు, ఇతర భవనాలు , ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విభాగంలో జరిగిన నష్టం అక్షరాలా రూ. 1,520 కోట్లు. అంటే మొత్తంగా చూసుకుంటే, ఈ దాడుల వల్ల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఇరాన్ మిస్సైల్స్ సృష్టించిన మంటలు వేల కోట్ల ఆస్తిని బూడిద చేశాయని తెలుస్తోంది. అమెరికా డిఫెన్స్ వలయాలను చీల్చుకుంటూ ఇరాన్ చేసిన ఈ దాడులు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం ఆర్థిక నష్టమే కాదు, అగ్రరాజ్యపు ఆయుధాల సామర్థ్యం సైతం ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది. . మరి దీనికి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉండబోతోంది? ఈ యుద్ధం ఇంకా ఎన్ని మలుపులు తిరగనుంది? అనేది చూడాలి.