ప్రపంచ సంగీత రంగంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన డ్యాన్సింగ్ సంచలనం ఎవరు అంటే, టక్కున చెప్పే పేరు మైఖేల్ జాక్సన్. పాప్ సంగీతానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఆయనను కింగ్ ఆఫ్ పాప్ అని ప్రపంచమే కొనియాడుతుంది. తన డాన్స్, స్టేజ్ ప్రెజెన్స్, గానంతో కోట్లాది మంది అభిమానులను ఉర్రుతలూగించిన మైఖేల్ జాక్సన్ జీవితం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు ఆ లెజెండ్ జీవితాన్ని తెరపై చూపించిన తాజా హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ ను కైవసం చేసుకుని సత్తా చాటుతోంది. ఈ బయోపిక్ ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి. హాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 217.4 మిలియన్ డాలర్ల గ్రాస్‌ను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఒక బయోపిక్ చిత్రానికి ఇంత భారీ ఓపెనింగ్ రావడం అనేది నిజంగా అరుదైన విషయం. ఈ రికార్డు ఇప్పటివరకు మరే బయోపిక్ కూడా సాధించలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఓపెనింగ్ ద్వారా మరోసారి మైఖేల్ జాక్సన్ ప్రభావం ఎంత గొప్పదో ప్రపంచానికి తెలిసింది. ఆయన పేరు కేవలం సంగీత రంగంలోనే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా ఎంతటి పవర్ కలిగి ఉందో ఈ సినిమా నిరూపించింది. కింగ్ ఆఫ్ పాప్ పై ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉన్న క్రేజ్ కు నిదర్శనం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సినిమా మొత్తంగా ఇంకెంత కలెక్షన్లు సాదించబోతుందో చూడాలి. ఎందుకంటే మొదటి రోజు వచ్చిన స్పందనను బట్టి చూస్తే, ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులను బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైఖేల్ అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు భారీగా వస్తున్నారు. ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ పాత్రలో నటించినది ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. స్క్రీన్‌పై మైఖేల్‌ను చూసినట్టే అనిపించేలా జీవించేశాడని ప్రేక్షకులు అంటున్నారు. దర్శకుడు అంటోయిన్ ఫుక్వా ఈ సినిమాను తెరకెక్కించారు.