డాక్టర్ బాబు లవ్ స్టోరీ…!

Spread the love

Carl Tanzler Love Story: ఈ ప్రపంచంలో అమర ప్రేమికులు ఎవరు అంటే..దేవదాసు పార్వతి, లైలా మజ్ఞు, సలీం అనార్కలి పేర్లే ముందుగా గుర్తొస్తాయి. కానీ మనకు తెలియని ఎన్నో చిత్ర విచిత్రమైన పిచ్చి ప్రేమికులు ఈ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు. అలాంటి ఓ లవ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ పేషెంట్ ను పిచ్చిగా ప్రేమించిన ఒక డాక్టర్ బాబు ప్రేమగాథ ఇది. ప్రియురాలు భయంకరమైన వ్యాధితో బాధపడుతుందని తెలుసు..ఎంతో కాలం బ్రతకదని ముందే తెలుసు..కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా అలాంటిదే ఈ లవ్ స్టోరీ. తన ప్రియురాలు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. కన్నవారు , అయినవారు అంతా ఆమెను మరిచిపోయారు ..కానీ ఈ డాక్టర్ బాబు మాత్రం తన ప్రేమను మరిచిపోలేకపోయాడు. ఆమె మృత దేహంతోనే ఏడేళ్ళు కలిసి జీవించాడు. ఇంతకీ ఈ డాక్టర్ బాబు ఎవరు? ఆమెను అంతలా ప్రేమించడానికి కారణమేంటి?

ఈ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు 94 ఏళ్ల క్రితం అమెరికాలో మొదలైంది. అంటే 1931లో జరిగింది. డాక్టర్ బాబు పేరు కార్ల్ టాంజ్లర్.ఆయన ప్రేయసి పేరు ఎలెనా డి హోయోస్ . అసలు వీరి ప్రేమ కథ ఎలా మొదలైందటే..22 ఏళ్ల ఎలెనా కు టిబి వచ్చింది. ఆమెను ఫ్యామిలీ మెంబర్స్ ట్రీట్మెంట్ కోసం ఫ్లోరిడాలోని మెరైన్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. అక్కడ ఆమె రేడియోలాజిక్ టెక్నీషియన్ అయిన కార్ల్ టాంజ్లర్‌ను మొదటిసారిగా కలిసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్లు ఆమెను చూసి కార్ల్ ఫిదా అయిపోయాడు. తనను తాను ఇంట్రడ్యూజ్ చేసుకున్నాడు. అంతేకాదు ఎలెనాతో తాను చిన్నప్పటి నుంచి కలగంటున్న ఓ కలను షేర్ చేసుకున్నాడు. తన కలలో నల్లటి జుట్టు ఉన్న అమ్మాయిని చూశానని.. అప్పటి నుంచి ఆమెనే ప్రేమిస్తున్నానని..ఆమె తన ప్రేయసి అని టాంజ్లర్ పోయెటిక్ గా ఆమెకు తన కలను వివరించాడు. తన కలలో కనిపించిన ఆ యువతి లక్షణాలు నీలో చూశానని ఎలెనాతో ఓపెన్ అయిపోయాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు.

టీబీతో బాధపడుతున్న ఎలెనాను ఎలాగైనా కాపాడాలనుకున్నాడు. తన కోసం కార్ల్ వింత వింత చికిత్సలను ప్రయత్నించాడు. ఆమె కోసం స్వయంగా ఇంట్లో తయారుచేసిన టానిక్స్, ఎలక్ట్రికల్ : అప్లయెన్సెస్ తో ట్రీట్మెంట్ చేసేవాడు. అలా ఒక రోజు ఎలెనాతో తన మనసులోని మాట చెప్పేశాడు. అయితే ఎలెనా అతని ప్రేమని రిజెక్ట్ చేసింది.అతను ఎంత ప్రయత్నించినా ఆమె ఓకే చెప్పలేదు. ఎలెనా తన ప్రేమను అంగీకరించకపోయినా కార్ల్ మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరికి 1931 అక్టోబర్ లో ఎలెనా ఈ లోకం నుంచి వెళ్లిపోయింది.

ఎలెనా మరణం తర్వాత ఆమె అంత్యక్రియలను నిర్వహించడంతో పాటు తన సొంత ఖర్చుతో సమాధిని నిర్మించాడు. ఆమె సమాధి తాళాలను సైతం తన దగ్గరే పెట్టుకున్నాడు. ప్రతి రోజూ రాత్రి ఎలెనా సమాధి దగ్గరికి వెళ్లేవాడు. సమాధి దగ్గర రకరకాల బహుమతులు పెట్టేవాడు. అక్కడే కాసేపు కూర్చుని ఆమెతో మాట్లాడేవాడు. సమాధిలో టెలిఫోన్ ఏర్పాటు చేసి ఎలెనా ఆత్మతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు. అలా ఎలెనా చనిపోయి రెండేళ్ళు గడిచాయి. 1933లో కార్ల్ ఎవరికీ తెలియకుండా సమాధి నుంచి ఎలెనా మృతదేహాన్ని వెలికితీసి తన ఇంటికి తీసుకెళ్లాడు.ఆమె దేహాన్ని భద్రపరిచాడు. ఆమె దేహంతోనే ఏడు సంవత్సరాలు కార్ల్ జీవించాడు. ఆమె బతికి ఉన్నట్లే భావించేవాడు. దీనిని బట్టి ఎలెనా అంటే కార్ల్ కు ఎంత పిచ్చి ప్రేమో అర్థం చేసుకోవచ్చు.

కోటు హ్యాంగర్లు , వైర్లు ఉపయోగించి ఎముకలను జాయింట్ చేసి మనిషి రూపాన్ని ఇచ్చాడు. ముఖాన్ని మైనం, ప్లాస్టర్‌తో పునర్నిర్మించాడు. ముఖానికి గాజు కళ్ళను పెట్టాడు. ఎలెనా నిజమైన జుట్టుతో ఒక విగ్‌ తయారు చేశాడు దానికి పెట్టాడు. పెర్ఫ్యూమ్, రసాయనాలతో శవం నుంచి దుర్వాసన రాకుండా భద్రపరిచాడు. నగలు వేసి అస్థిపంజరాన్ని అందంగ అలంకరించాడు. ఈ రూపాన్ని మంచం మీద తన పక్కనే పెట్టుకున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 సంవత్సరాలు ఆమె డెడ్ బాడీతో గడిపాడు. 1940లో ఎలెనా సోదరికి కార్ల్ బిహేవియర్ పై డౌట్ వచ్చింది. కార్ల్ ఇంటికి వెళ్ళింది. మంచం మీద ఎలెనా డెడ్ బాడీని చూసి షాక్ అయ్యింది. వెంటనే కార్ల్ పై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. శవాన్ని దొంగిలించినందుకు పోలసులు కార్ల్ ను అరెస్టు చేశారు. అయితే చట్ట ప్రకారం అతనిపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. Carl Tanzler Love Story.

పోలీసులు కార్ల్ ను అరెస్టు చేయడంతో ఈ విషయం అమెరికాలో అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. స్థానిక న్యూస్ పేపర్స్ లో సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. అతని విషాద ప్రేమ గాథను ఎన్నో న్యూస్ పేపర్స్ పబ్లిష్ చేశాయి. దీంతో అమెరికన్ ప్రజలు కార్ల్ ను ట్రూ లవర్ గా భావించారు. ఎలెనా మృతదేహం కూడా అందరినీ ఆకర్షించింది. కార్ల నుంచి ఎలెనా మృతదేహాన్ని సేకరించిన అనంతరం అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఆమె బాడీని ప్రదర్శనకు పెట్టారు. వేలాది మంది ఆమెను చూసేందుకు తరలివచ్చారు. ఆ తర్వాత ఎవరూ ఆమెను మళ్ళీ బయటకు తీయలేని విధంగా సీక్రెట్ గా సమాధి చేశారు. అనంతరం 1952లో కార్ల్ చనిపోయాడు. అతను మరణించే సమయంలో కూడా అయన దగ్గర ఎలెనాను పోలిన మనిషి ఆకారంలో ఉండే ఓ పెద్ద బొమ్మ ఉందని చెబుతారు. ఈ సాడ్ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలా కూడా ఓ మనిషిని ప్రేమిస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.