అంతర్జాతీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ మిస్సైల్ దాడులు చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పేలుళ్లతో ఉలిక్కిపడింది. దీంతో ఆ ప్రాంతమంతా పొగ అలముకుంది. ఈ దాడిని తామే చేశామని టెల్ అవీవ్ ప్రకటించింది. దీనిని ‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా’గా పేర్కొంది. శత్రు దేశం నుంచి పొంచిఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇరాన్ లోని పలు ప్రాంతాలను టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇక తమ దేశ ప్రజలను కూడా ఇజ్రాయెల్ అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్ అంతటా సైరన్లు వినిపిస్తున్నాయి. ప్రజలు రక్షణ ప్రాంతాలకు అందుబాటులో ఉండాలని మొబైల్ ఫోన్ల ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉన్నందున, ప్రజలను సిద్ధం చేయడానికి ఈ ముందస్తు హెచ్చరిక జారీ చేయబడింది. ప్రజలందరూ రక్షణ ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని ఐడిఎఫ్ (IDF) చెప్పింది. దేశంలోని అన్ని ప్రాంతాలను ‘పూర్తి స్థాయి కార్యకలాపాల’ నుండి ‘అవసరమైన కార్యకలాపాల’ (Essential Activity) స్థాయికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైన రంగాలు మినహా విద్యా సంస్థల కార్యకలాపాలు, బహిరంగ సమావేశాలు మరియు కార్యాలయాలపై నిషేధం విధించబడింది.
ప్రజలందరూ హోమ్ ఫ్రంట్ కమాండ్ అధికారిక ఛానళ్లలో ప్రచురించబడిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. పూర్తి వివరాలు మరియు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నేషనల్ ఎమర్జెన్సీ పోర్టల్ మరియు హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్‌ను చూడవచ్చని పేర్కొంది. ఇక ఈ పరిణామం పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఆపరేషన్‌లో అమెరికా దళాలు కూడా నేరుగా పాల్గొన్నట్లు వార్తలు వస్తున్నాయి. టెహ్రాన్‌పై దాడులు జరుగుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులు కూడా ధృవీకరించినట్లు తెలుస్తోంది.