ఓటరు లిస్టు నుండి అర్హులైన ఏ ఒక్కరిని తొలగించే ప్రసక్తే లేదని ఛీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం వెస్ట్ బెంగాల్ లో పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశకుమార్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ లో స్వేచ్చగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడటమే ఈసీ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని రూల్స్ ప్రకారమే అన్ని రాష్ట్రాల్లో ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్.ఐ.ఆర్) అమలవుతుందన్నారు. ఓటరు లిస్టులో తప్పులు లేకుండా అర్హులైన వారి పేర్లు ఆ జాబితాలో ఉండేలా చూడటమే ‘ఎస్.ఐ.ఆర్’ బాధ్యత అని అన్నారు. ఇక్కడ ఎలక్షన్స్ ఎన్ని దశల్లో జరుగుతాయనేది.. రాష్ట్రప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయంలో చేపట్టే చర్యలను బట్టి ఉంటుందన్నారు. బెంగాల్ ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విధులు నిర్వర్తించాలన్నారు. ఓటర్లపైనా, ఎలక్షన్ ఆఫీసర్ల పైనా రాజకీయ నేతలు ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా సహించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్లో లో దాదాపు 80వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని వాటిల్లో దాదాపు 61,000 గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఓటింగ్ ప్రాసెస్ లో ట్రాన్స్పరెన్సీ పెంపొందించేందుకు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను చేయనున్నట్లు పేర్కొన్నారు.