‘‘డె*త్‌ సిక్‌’’.!

Spread the love

Indonesia Death Culture: పుట్టిన వాడు గిట్టక తప్పదు…గిట్టిన వాడు పుట్టక తప్పదు అనేది శ్రీకృష్ణడు భగవద్గీతలో చెప్పిన ఒక సనాతన సత్యం. అయితే సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మరణాన్ని మాత్రం అడ్డుకోవడం లేదు. కాకపోతే జీవిత కాలాన్ని పొడిగిస్తుంది. ఇక ఎవరు మరణించినా చివరకు కలిసేది మట్టిలోనే. అంటే మరణం తర్వాత ఖననం చేయడం లేదా దహనం చేయడం చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం మరణాన్ని అంత్యక్రియలతో ముగించకుండా, జీవితం మరో దశగా భావిస్తారు. ఇంతకు ఎక్కడ ఆ ప్రాంతం తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ

ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో నివసించే తోరజా తెగ ప్రజల సంస్కృతిలో మరణం, మృతదేహాలతో వ్యవహరించే విధానం ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైనది..ఆసక్తికరమైనది. ఈ తెగ ప్రజలు మరణించిన వారిని కొన్ని సందర్భాలలో నెలలు లేదా సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉంచుకుని, జీవించి ఉన్నవారిలాగే చూసుకుంటారు. సులవేసి దీవిలో, పర్వత ప్రాంతాల నడుమ ఉన్న మారుమూల ప్రాంతంలో నివసించే తోరజా తెగ ప్రజలు తమ పూర్వీకుల పట్ల, మరణం పట్ల చూపించే గౌరవం, అనుబంధం అద్భుతం. బాహ్య ప్రపంచానికి వింతగా కనిపించినప్పటికీ, తోరజా ప్రజలకు ఇది వారి జీవితంలో, విశ్వాసంలో చాలా ముఖ్యమైన భాగం.తోరాజా తెగ ప్రజలు, మరణాన్ని అంత్యక్రియలతో ముగించకుండా, జీవితం మరో దశగా భావిస్తారు. వారి దృష్టిలో శరీరం చనిపోవడం కాదు, కేవలం ‘‘జీవిత విరామం’’ మాత్రమే. అందుకే వారు మృతదేహాలను ‘‘డెత్‌ సిక్‌’’ అని పిలుస్తారు. ‘‘డెడ్‌ బాడీ’’ అని పిలవడం అవమానంగా భావిస్తారు అక్కడి ప్రజలు.

తోరజా ప్రజల నమ్మకం ప్రకారం, మరణం అనేది ఒక అంతం కాదు, అది ఒక సుదీర్ఘమైన ‘ఆధ్యాత్మిక ప్రయాణం’ లోని ఒక భాగం మాత్రమే. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా, వారి అంత్యక్రియలు అంగరంగ వైభవంగా జరిగే వరకు వారు కుటుంబంలో ఒక సభ్యుడిగానే పరిగణించబడతారు. ఈ కర్మ పూర్తి అయ్యే వరకు, చనిపోయిన వ్యక్తిని ‘చనిపోయినవారు’గా కాకుండా, కేవలం ‘తో మకులా’ అంటే ‘జబ్బుపడిన వ్యక్తి’ లేదా ‘నిద్రపోతున్న వ్యక్తి’ గా భావిస్తారు. మరణించిన వ్యక్తికి పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహించడానికి తోరజా ప్రజలకు తరచుగా నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. అంతవరకు, మృతదేహాన్ని ఫార్మాలిన్ వంటి రసాయనాలను ఉపయోగించి మమ్మీఫై చేసి ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంచుతారు.

కుటుంబం తమ ప్రియమైన వ్యక్తి ఆత్మ తమతోనే ఉందని, ఇంట్లోనే ఉందని గట్టిగా నమ్ముతుంది. ఈ విధంగా మృతదేహంతో ఇంట్లో ఉండటం వారి బాధను తగ్గించుకోవడానికి, వారికి వీడ్కోలు చెప్పడానికి సిద్ధం కావడానికి సహాయపడుతుందని భావిస్తారు. పాతకాలంలో శరీరం పాడవకుండా ఉండేందుకు టీ పొడి, సహజ సుగంధ ద్రవ్యాలు రాసే పద్ధతి ఉండేది. ఇప్పుడు కాలం మారడంతో, ప్రత్యేకమైన ఇంజెక్షన్లు, లేదా బాల్సన్‌ ఎంటీ అనే ఔషధ మొక్కల పదార్థాలను వాడుతున్నారు. ఈ విధానం ద్వారా మృతదేహాలు చాలా కాలం చెడిపోకుండా ఉంటాయి. మృతదేహాలను పూడ్చడం, కాల్చడం వంటి పద్ధతులు వీరికి అవసరం లేదు. వాస్తవానికి వారు మృతదేహాలను తమకెదురుగా ఉంచి జీవిస్తారు. ఎవరైనా అతిథులు వస్తే, పెట్టె తెరవడం సహజం. వారిని ‘‘ఇదే మా కుటుంబ సభ్యుడు’’ అంటూ పరిచయం చేస్తారు. అవును ఇది నిజం.

తోరాజా ప్రజలకు మరణం శోకం కాదు. అది కుటుంబంలో పునఃస్మరణకు, ప్రేమకు పండుగ సమానమైన వేళ. ప్రతి సంవత్సరం ప్రత్యేక వేడుకల ద్వారా తమ మరణించిన బంధువులను స్మరించుకుంటారు. వారిని తిరిగి అలంకరించి, కొత్త బట్టలు వేయడం, ఒక పండుగలా మృతదేహాలను ఊరేగించడం అక్కడ సాధారణం. అంతే కాదు, పుట్టినప్పుడు పిల్లలు జీవం పొందినట్లే, చనిపోయిన తర్వాత కూడా ‘‘తమతోనే ఉన్నారు’’ అనే విశ్వాసంతో ఉంటారు అక్కడి ప్రజలు వారి దృష్టిలో మరణం అనేది సంబంధాల ముగింపు కాదు….గృహ నిర్మాణంలో మృతుల గుర్తులు.

తోరాజా ఇళ్ల నిర్మాణాలు ఇతర ప్రాంతాల కంటే ఎంతో భిన్నంగా ఉంటాయి. యజమాని మరణిస్తే, ఇంటిపై ప్రత్యేకమైన పైపు ప్రతిష్ఠిస్తారు. దీని ద్వారా గ్రామంలో అందరికీ ఆ ఇంట్లో మరణం జరిగిందని తెలుస్తుంది. తర్వాత ఆ మృతదేహాలను గుహల్లో వేస్తారు. ఈ శ్మశాన గుహలు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే కొనసాగుతున్నాయి. కొన్నింటిలో చక్కగా చెక్కిన బాక్సులు, మరికొన్నింటిలో కఠినంగా చెక్కిన ప్రతిమల రూపంలో ఉన్న బొమ్మలు ఉంటాయి. అవి శవాన్ని సూచించే చిహ్నాలుగా ఉపయోగిస్తారు. బాక్సులు తెరవకుండానే ఆ బొమ్మల ద్వారా గౌరవం తెలుపుతారు. తోరాజా ప్రజలు తమ ఆచారాలపై గర్వపడతారు. బయటివారిని భయపడవద్దని చెప్పి, ఈ శవాల గుహలను పర్యాటకులకు చూపిస్తారు. చిన్నపిల్లల మృతదేహాలను చిన్న కాఫిన్‌లలో ఉంచడం, వారిని సదా సాంత్వనంగా స్మరించుకోవడం కూడా ఈ సంస్కృతిలో ఒక భాగం. తోరాజా తెగ జీవన విధానం మానవ సంస్కృతికి కొత్త కోణాన్ని చూపిస్తుంది. మృతదేహాలను భయంతో కాక, ప్రేమతో చూస్తే జీవితానికి గాఢమైన అర్థం దొరుకుతుందని ఈ సంఘం నిరూపిస్తుంది. ఇది కేవలం ఒక తెగ ఆచారం కాదు జీవితానికి, మరణానికీ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతిరూపం. Indonesia Death Culture.

మరణించారని ఇక్కడ ఎవ్వరూ ఏడవరు, మరణాన్ని శాపంగా భావించరు. వారి ఊహాలోకం ప్రకారం మృత్యువు అనేది ఆత్మ మరొక ప్రయాణానికి బయలుదేరిన దశ. అందుకే ఈ తెగ ప్రజలు మరణాన్ని భయంతో కాక, ఆప్యాయతతో స్వాగతిస్తారు. అనుబంధం, మనసుని బంధించే ప్రేమ, నిరంతర జీవనం అనే భావనల సమ్మేళనం వీరి సంస్కృతి ప్రత్యేకత. ఇదే తొరాజా తెగవారిని ప్రత్యేకంగా నిలిపింది.