ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పేరున్నహార్ముజ్ జలసంధిని ఇరాన్ అధికారికంగా మూసివేసింది. షిప్ లు దాటేందుకు ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ వద్ద 700కి పైగా షిప్ లు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1వ తేదీన ఈవే నుండి బయటకు కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే వెళ్లగా, మార్చి 2న కేవలం ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక సన్నని సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే ఆయిల్ లో దాదాపు 20% నుండి 30% వరకు ఈ మార్గం నుండే సరఫరా అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యూఏఈ, కువైట్ మరియు ఇరాక్ వంటి ప్రధాన ఆయిల్ ప్రొడక్షన్ దేశాలకు ఇది ఏకైక సముద్ర మార్గం. ఈ జలసంధిలో స్వల్ప అంతరాయం కలిగినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకే ప్రభావం ఉంది.
భౌగోళికంగా ఈ జలసంధి అత్యంత సన్నది కూడా. దీని వెడల్పు అత్యల్పంగా సుమారు 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. దీనివల్ల యుద్ధ సమయాల్లో లేదా రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఈ మార్గాన్ని దిగ్బంధించడం సులభం అవుతుంది. ఇరాన్ ఈ జలసంధిపై గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉంది. ఇప్పుడు అమెరికాతో నెలకొన్న పరిణామాల కారణంగా ఇరాన్ కు ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారింది.