గుజరాత్‌లోని సానంద్ లో ఉన్న కైన్స్ సెమికాన్ OSAT ప్లాంట్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రారంభించారు. కైన్స్ సెమికాన్ ప్రారంభోత్సవం స్వయం సమృద్ధి దిశగా భారతదేశం చేస్తున్న కృషిని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ అన్నారు. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలో ఇది ఒక మైలురాయి వంటి అడుగని గుజరాత్ లోని సానంద్ లో కైన్స్ సెమికాన్ OSAT ప్లాంట్ ప్రారంభం కావడం భారతదేశ సెమీకండక్టర్ రంగానికి నిజంగా గర్వకారణమని పేర్కొన్నారు. ఇది భవిష్యత్ సాంకేతికతలు మరియు ఆవిష్కరణలలో అగ్రగామిగా ఎదగాలన్న భారతదేశ ప్రయత్నాలకు గొప్ప ఊతాన్నిస్తుందన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మేక్ ఫర్ ది వరల్డ్’ లక్ష్యాలకు ఇది ఒక ప్రోత్సాహమని పేర్కొన్నారు. భారతదేశ సెమీకండక్టర్ పరిశ్రమ వివిధ రాష్ట్రాల్లో వర్ధిల్లుతోంది, దీనివల్ల లెక్కలేనంత మంది యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను మరింత విస్తృతం చేయడానికి మేము ఇప్పుడు ‘సెమీకండక్టర్ మిషన్ 2.0’పై పని చేస్తున్నాము. ఇది భారతదేశపు ‘టెకేడ్’ (Techade)!సాంకేతికత, AI మరియు సెమీకండక్టర్లలో మేము చేపట్టిన కార్యక్రమాలు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చబోతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, సెమీకండక్టర్ మిషన్ 2.0లో భాగంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో (Global Supply Chain) భారత్ కీలక పాత్ర పోషించనుంది. గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్ లో భారత్ కేవలం ఒక వినియోగదారు స్థాయి నుండి, ఒక కీలకమైన భాగస్వామిగా వేగంగా దూసుకెళ్తోంది. ప్రపంచ దేశాలు సెమీకండక్టర్ సరఫరా కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ చైనా స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది. 2030 నాటికి భారత్ తన సెమీకండక్టర్ ఎగుమతులను $80 బిలియన్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ లు, కార్లు, డేటా సెంటర్లు మరియు AI రంగాలకు అవసరమైన చిప్ ల సరఫరాలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది.