ట్రంప్ ‘బిగ్ యూ-టర్న్’ ముగింపు దిశగా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు?

Spread the love

అతి సర్వత్రా వర్జయేత్ అంటే  ఏ విషయంలోనైనా అతి పనికిరాదని అర్ధం. ఇన్నాళ్లూ పశ్చిమాసియాలో మిస్సైల్స్ మోత మోగించిన అమెరికా, ఇప్పుడు ఒక్కసారిగా తన స్వరాన్ని మార్చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పును ఆర్పేందుకు అగ్రరాజ్యం అడుగులు వేస్తోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. యుద్ధం మొదలుపెట్టడం సులభమే కానీ, దాన్ని గౌరవంగా ముగించడం చాణక్యం అనిపించుకుంటుంది. మరి ట్రంప్ వేసిన ఆ ‘ఎగ్జిట్ ప్లాన్’ ఏంటి? యుద్ధ భూమి నుంచి నిష్క్రమణ వ్యూహం వెనుక ఉన్న మతలబు ఏంటి? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మిడిల్ ఈస్ట్ గత కొంతకాలంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న పోరులో అమెరికా కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే, ఇరాన్‌ పై దాడులు కొనసాగుతున్న తరుణంలోనే ట్రంప్ ‘యుద్ధ విరామం’  ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.ట్రంప్ తన ప్రకటనలో ప్రధానంగా  Exit Plan గురించి ప్రస్తావించారు. అంటే, కేవలం యుద్ధాన్ని ఆపడమే కాకుండా, తన సైన్యాన్ని సురక్షితంగా ,  వ్యూహాత్మకంగా అక్కడి నుంచి ఎలా ఉపసంహరించుకోవాలో స్పష్టమైన రోడ్ మ్యాప్‌ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అదృష్టం కొద్దీ దొరికిన విజయం కంటే, ప్రణాళికాబద్ధంగా సాధించిన విజయం గొప్పది.ట్రంప్ మాటల్లో ఇప్పుడు ఇదే ధ్వనిస్తోంది. అమెరికా తన సైనిక లక్ష్యాలను దాదాపు పూర్తి చేసిందని, లక్ష్య సాధనకు అతి సమీపంలో ఉన్నామని ఆయన ప్రకటించారు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యాలను దెబ్బతీయడం లేదా ఆ దేశ దూకుడును కట్టడి చేయడం వంటి ఏ లక్ష్యాలతో అయితే అమెరికా బరిలోకి దిగిందో, అవి నెరవేరాయని వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే, ఇకపై అక్కడ బలగాలను ఉంచి అనవసర ప్రాణ, ఆస్తి నష్టాన్ని కొని తెచ్చుకోవడం కంటే, గౌరవంగా వెనక్కి తగ్గడమే ఉత్తమమని ట్రంప్ భావిస్తున్నారు.

మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యం దశాబ్దాలుగా పాగా వేసింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న సైనిక కార్యకలాపాలను క్రమంగా తగ్గించాలని ట్రంప్ నిర్ణయించారు. ఇది రాత్రికి రాత్రే జరిగే ప్రక్రియ కాదని, దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా, ఇప్పుడు శాంతి మంత్రాన్ని పఠించడం వెనుక అంతర్జాతీయ ఒత్తిడితో పాటు, స్వదేశీ రాజకీయ అవసరాలు కూడా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.  అంతర్జాతీయ వేదికపై ఇప్పుడు సరిగ్గా ఇదే జరుగుతోంది. ఈ దాడుల వెనుక ఉన్న అసలు కారణాలను, సాధించిన విజయాలను సాక్షాత్తూ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా బయటపెట్టారు. డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఒక సుదీర్ఘ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది కేవలం ప్రకటన కాదు, ఇరాన్‌కు ఒక హెచ్చరిక. ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అమెరికా సాధించిన ఫలితాలేంటి? అన్న విషయాలను ఆయన పాయింట్ల వారీగా వివరించారు. మిస్సైల్ సామర్థ్యంపై దెబ్బ: ఇరాన్ గర్వంగా చెప్పుకునే క్షిపణి వ్యవస్థను అమెరికా ఛిన్నాభిన్నం చేసిందని . వారి ప్రయోగ కేంద్రాలను నేలమట్టం చేయడం ద్వారా ఇరాన్ ఎదురుదాడి చేసే శక్తిని కోల్పోయిందన్నారు ట్రంప్. యుద్ధానికి వెన్నెముకగా నిలిచే పారిశ్రామిక కేంద్రాలను, ఆయుధ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయన్నారు. ఇరాన్ ఎయిర్ స్పేస్ లో  అమెరికా ఫైటర్ జెట్ లు  గర్జించాయని  వారి ఎయిర్ బేస్ ను, సముద్రంలో ఆధిపత్యం చలాయించే నేవీని  పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక రవాణాకు ఎంతో కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లను కలిపే ఈ సన్నని జలసంధి గుండానే ప్రపంచంలోని మొత్తం చమురు వినియోగంలో దాదాపు 20 నుండి  30 శాతం రవాణా అవుతుంది.ప్రపంచానికి అవసరమైన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG)లో సింహభాగం ఇక్కడి నుంచే వెళ్తుంది.  ఈ మార్గంలో చిన్న అవాంతరం కలిగినా, అది అమెరికా నుంచి ఆసియా వరకు పెట్రోల్ బంకుల వద్ద రేట్లపై ప్రభావం చూపుతుంది.గత మూడు వారాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. షిప్ లపై దాడులు, డ్రోన్ల సంచారం మరియుమిసైల్  ప్రయోగాలు ఈ రీజియన్‌ను ఉద్రిక్తంగా  మార్చాయి. ఈ యుద్ధం వల్ల సామాన్య దేశాలు ఇంధన ధరలతో తలమునకలవుతుంటే, అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి.  ట్రంప్ చేసిన ప్రకటన ఈ యుద్ధ వాతావరణంలో పెను సంచలనాన్ని సృష్టించింది. యుద్ధం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ రీజియన్‌పై పట్టు సాధించేందుకు ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కంటే, తమ ప్రయోజనాలను కాపాడుకోవడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. జపాన్ వంటి దేశాలు సైతం మధ్యవర్తిత్వానికి సిద్ధమవ్వడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. హోర్ముజ్ సంక్షోభం కేవలం మిడిల్ ఈస్ట్ సమస్య కాదు. జపాన్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90% చమురును ఈ మార్గం నుంచే దిగుమతి చేసుకుంటుంది. అందుకే జపాన్ ఈ జలసంధిని విడిపించడానికి, శాంతిని నెలకొల్పడానికి తన దౌత్య మార్గాలను ఉపయోగిస్తోంది. హోర్ముజ్ జలసంధిలో శాంతి లేకపోతే ప్రపంచానికి ప్రశాంతత లేదు. మొత్తానికి.. ట్రంప్ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని క్షేమంగా బయటపడాలని చూస్తున్నారు. ఇరాన్ శక్తినైతే తగ్గించారు కానీ, ఆ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత అంత సులభంగా మారుతుందా? ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగి వస్తాయా? లేక మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం మిడిల్ ఈస్ట్  ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *