బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా నూతన సంవత్సర వేళ (జనవరి 1, 2026) ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అబద్ధాలు, అవినీతితో దేశాన్ని అధోగతి పాలు చేస్తోందని ఆమె ఆరోపించారు. అవామీ లీగ్ అధికారిక ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పంచుకున్న సందేశంలో, చట్టవిరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకున్న పాలకులు దేశాన్ని చీకటిలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు భయపడుతున్నాయని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1971 విమోచన యుద్ధ వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు దేశాన్ని రక్షించుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. 2026లోనే దీనికి ఒక నిర్ణయాత్మక ఫలితం వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.