Unity is strength అనే సూత్రంతో ముందుకు సాగుతున్న భారత్ 

Spread the love

అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ.. 9 ఏళ్ల సుదీర్ఘ కాలం  తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ గడ్డపై అడుగుపెట్టారు. టెల్ అవీవ్ విమానాశ్రయం సాక్షిగా ప్రపంచ దౌత్య చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒకవైపు స్నేహ హస్తం.. మరోవైపు శత్రువుల గుండెల్లో వణుకు మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించిన ప్రత్యేక విమానం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ల్యాండ్ అవ్వగానే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన ఆత్మీయతను చాటుకున్నారు. సాధారణంగా ప్రధానుల పర్యటనలో ప్రోటోకాల్ అనేది ఒక చట్టంలా ఉంటుంది. కానీ మోదీ కోసం నెతన్యాహు ఆ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టారు. తన సతీమణి సారాతో కలిసి స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు కౌగిలించుకుంటే, అక్కడ పాకిస్థాన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఉగ్రవాదంపై ఇరు దేశాల ఉమ్మడి పోరు, అధునాతన యుద్ధ తంత్రాల మార్పిడి వంటి అంశాలు పాక్ కు నిద్రను దూరం  చేస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా, భారత్ తన రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ సహకారంతో పటిష్టం చేసుకుంటుందన్న భయం ఇస్లామాబాద్‌ను వెంటాడుతోంది. బలమైన స్నేహాన్ని ఏ శక్తి విడదీయలేదు  అన్నట్లుగా ఉంది భారత్-ఇజ్రాయెల్ మైత్రి. ప్రపంచ రాజకీయ పటంలో ఇప్పుడు ఒక సరికొత్త చరిత్ర లిఖించబడబోతోంది. 

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలన్నా, ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నా భారత్ వంటి దేశం తోడుండాలని ఇజ్రాయెల్  బలంగా విశ్వసిస్తోంది. ఒకప్పుడు అరబ్ దేశాలు , ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అబ్రహం ఒప్పందాల తర్వాత అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సంబంధాలుమెరుగుపడ్డాయి. అరబ్ దేశాలు మరియు ఇజ్రాయెల్.. ఈ రెండింటితోనూ మంచి సంబంధాలున్న ఏకైక దేశం భారత్. అందుకే ఈ ‘హెక్సాగన్’కు భారత్ వెన్నెముక వంటిది. అగ్రరాజ్యాల చదరంగంలో మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఆధిపత్యం చలాయించిన శక్తులకు చెక్ పెట్టేందుకు సరికొత్త వ్యూహం సిద్ధమైంది. అదే ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’. ఇరాన్ వ్యూహాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇందులో భారత్‌ను భాగస్వామిని చేయడంపై దాయాది దేశం పాకిస్థాన్ గొంతులో పచ్చి వెలగకాయ పడ్డట్టు అయింది.

నెతన్యాహు ‘హెక్సాగన్ ఆఫ్ అలయన్స్’ అనే సరికొత్త కూటమిని తెరపైకి తెచ్చారు. తీవ్రవాద శక్తుల ప్రభావాన్ని తగ్గించడం.ప్రాంతీయ భద్రతను పటిష్టం చేయడం.ఆర్థిక , రక్షణ రంగాల్లో సభ్య దేశాల మధ్య సమన్వయం. ఈ కూటమిలో భారత్‌ను చేర్చుకోవాలని నెతన్యాహు ప్రతిపాదించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. భారత్ యొక్క పెరుగుతున్న ఆర్థిక శక్తి, రక్షణ సామర్థ్యం ఈ కూటమికి వెన్నుముకగా మారుతాయని ఇజ్రాయెల్ భావిస్తోంది. భారత్ పెరుగుతున్న ప్రాధాన్యతను తట్టుకోలేక పాకిస్థాన్ విషం చిమ్ముతోంది.భారత్ ఈ కూటమిలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ సెనేట్ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ కూటమి వల్ల ప్రాంతీయ శాంతికి విఘాతం కలుగుతుందని, ఇది దక్షిణాసియాలో అస్థిరతకు దారితీస్తుందని పాక్ ఆరోపిస్తోంది. 

అయితే పాకిస్థాన్ ఆరోపణల్లో పసలేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా ముద్ర పడ్డ పాకిస్థాన్, తీవ్రవాద వ్యతిరేక కూటమిని విమర్శించడం హాస్యాస్పదమని నెతన్యాహు వర్గం ధీటుగా సమాధానమిస్తోంది. భారత్ ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందని, కానీ తీవ్రవాదంపై పోరులో రాజీ పడదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు ఈరోజు నిన్నటివి కావు. కానీ, గత దశాబ్ద కాలంలో ఈ బంధం మరింత పటిష్టంగా మారింది. భారత్ తన దౌత్య నీతితో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకుంటుంటే, పాక్ మాత్రం ఉగ్రవాద ముద్రతో, ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతోంది. అసిమ్ మునీర్ ఎంతగా గొంతు చించుకున్నా, మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్‌లో ఇజ్రాయెల్-భారత్-సౌదీల మధ్య ఏర్పడుతున్న కొత్త బంధాన్ని ఆపడం అసాధ్యం.

భారత్-ఇజ్రాయెల్ స్నేహం పాకిస్థాన్ సైన్యాధిపతికి నిద్ర లేకుండా చేస్తోంది. “గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు” భారత్ తన రక్షణ కోసం చేస్తున్న ఒప్పందాలను చూసి పాక్ భయపడుతోంది.  ఒకప్పుడు ఇజ్రాయెల్‌తో సంబంధాల కోసం వెనకాడిన రోజులు పోయి, ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే కూటమిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. నెతన్యాహు ‘హెక్సాగన్’ ప్లాన్ గనుక వర్కౌట్ అయితే, అటు చైనాకు, ఇటు పాకిస్థాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బే. Unity is strength అనే సూత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. మరి ఈ కూటమి భవిష్యత్తులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *