ఫిబ్రవరి 27 రేపు శుక్రవారం రిలీజ్ కావాల్సిన ‘ది కేరళ స్టోరీ 2′ సినిమాకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సినిమా మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఉందని సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాపై దాఖలైన పిటిషన్లపై నేడు కేరళ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సినిమా కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, మత సామరస్యానికి భంగం కలిగించే అంశాలు ఉన్నాయని దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ నేడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ మూవీ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ మూవీ అదే స్థాయిలో వివాదాస్పదం కూడా అయింది. ఇక ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్గా ‘ది కేరళ స్టోరీ 2’ రాబోతోంది. దీనికి కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు.