గత కొద్దిరోజులుగా ఉద్రిక్తతలతో అట్టడుకుతున్న మధ్యప్రాచ్యంలో కాస్త ప్రశాంత పరిస్థితులు ఏర్పడి శాంతిస్థాపన జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. దాడులు ఉద్రిక్తమవుతాయనే సమయంలో.. వాషింగ్టన్ నుండి ఒక ఊహించని వార్త బయటకు వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో చేస్తున్న యుద్ధంపై ఒక కీలక ప్రకటన చేశారు. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ లో ఈమేరకు ట్రంప్ పోస్ట్ చేస్తూ ఇరాన్‌పై మిలిటరీ దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ పరిణామాలు ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతాయో ఎవరూ ఊహించలేరు.గత నెల నుండి అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఎంతో కీలకమైన లాంటి హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవడం పట్ల అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. కానీ ట్రంప్ అకస్మాత్తు నిర్ణయంతో పరిస్థితులు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఇరాన్ తో జరుపుతున్న చర్చలు సక్సెస్ అవుతున్నాయి, కాబట్టి సైనిక దాడులను వాయిదా వేయమని నేను మా డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు ఇచ్చానని సంచలనం రేపారు. నిన్నటి దాకా ఫైర్ మీద ఉన్న ట్రంప్ నేడు శాంతి గీతాన్ని ఆలపించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో గ్లోబల్ మార్కెట్లు, గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. నేను మా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్ కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇరాన్‌కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన సైనిక దాడులను తక్షణమే వాయిదా వేయాలని సూచించాను అని ట్రంప్ తన పోస్ట్‌లో తెలిపారు. అయితే ట్రంప్ దాడులను పూర్తిగా ఆపుతామనలేదు. కేవలం వాయిదా మాత్రమే వేశారు. ఒకవేళ ఇరాన్ మళ్లీ గల్ఫ్ దేశాల ఆయిల్ ట్యాంకర్లపై దాడులు చేసినా, లేదా ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగినా.. ఈ తాత్కాలిక బ్రేక్ కాస్తా మళ్లీ భీకర యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ కాస్త తగ్గుముఖం పట్టింది. దౌత్యం ద్వారా ఎంతటి సంక్షోభాన్నైనా పరిష్కరించవచ్చని ఈ పరిణామం రుజువు చేస్తోంది.