ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయా..? ఇస్లామాబాద్‌ లో శాంతి చర్చలు

Spread the love

ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌ పైనే ఉన్నాయి. ఉద్రిక్తతలకు చెక్ పెట్టే దిశగా అమెరికా, ఇరాన్ దేశాల అగ్రనేతలు ముఖాముఖి చర్చలకు సిద్ధమవుతుండటంతో.. ఇస్లామాబాద్ ఒక అభేద్యమైన కోటలా మారిపోయింది. గాలి కదలికను కూడా పసిగట్టేలా భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. అగ్రరాజ్యం అమెరికా నుండి  కీలక ప్రతినిధుల బృందం వస్తుండటంతో, పాకిస్తాన్ ప్రభుత్వం తన సర్వశక్తులూ ఒడ్డి భద్రతను పర్యవేక్షిస్తోంది.ముందు జాగ్రత్త చర్యగా.. అమెరికా నుంచి 30 మంది సభ్యుల అడ్వాన్స్ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన చర్చలు జరగనున్న తరుణంలో పాకిస్తాన్ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక శాంతికి బాటలు వేసేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఒక కీలక అడుగు పడబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగనున్న ఈ ‘కాల్పుల విరమణ’ చర్చలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించి, కాల్పుల విరమణ దిశగా కీలక చర్చలు జరగనున్నాయి. 

ఈ చర్చలు కేవలం రెండు దేశాల మధ్య సమస్యలకే పరిమితం కావు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా మధ్య సాగుతున్న దాడులను ఆపేందుకు ఇరాన్ సహకారం కూడా కీలకం. అమెరికా తన ఆర్థిక, సైనిక దౌత్యం ద్వారా ఒక ఒప్పందానికి రావాలని చూస్తుంటే, ఇరాన్ తనపై ఉన్న ఆంక్షలు మరియు ప్రాంతీయ భద్రత గురించి గళం విప్పనుంది. జరగబోయే ఈ చర్చలు ఆసియా దేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలను తొలగిస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ఈ చర్చల  కోసం కల్పిస్తున్న పటిష్ట  భద్రత నడుమ ఆయా దేశాలు ఏ నిర్ణయాలు తీసుకుని ఈ ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతాయో లేదో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *