బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి ఈరోజు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే.టీ.ఆర్,మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ ను కలిసిన సందర్భంగా అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని అంటూ జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇటీవల జీవన్ రెడ్డిని కే.టీ.ఆర్ కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో కేసీఆర్ ని కలసి, రెండు మూడు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని జీవన్ రెడ్డి తెలిపారు. అన్నట్లుగా నేడు ఆయన కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జీవన్ రెడ్డి చేరిక కచ్చితంగా బీ.ఆర్.ఎస్ పార్టీకి అద్భుతమైన బలాన్ని చేకూరుస్తుందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో సేవలందించిన నిబద్ధత కలిగిన నాయకుడిగా జీవన్ రెడ్డికి మంచి పేరుంది.