టార్పెడోతో ఇరాన్ నౌకను కూల్చేసిన అమెరికా: ముదురుతున్న యుద్ధ మేఘాలు!

Spread the love

అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ముట్టడిస్తుంటే.. మిడిల్ ఈస్ట్  అగ్నిగుండంలా మారుతోంది.  పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత రగిలిన మంటలు ఇప్పుడు సముద్ర గర్భంలోనూ చిచ్చు రేపుతున్నాయి. విశాఖ తీరం నుంచి వెళ్తున్న ఇరాన్ సైనిక నౌకను అమెరికా జలాంతర్గామి లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. 

అమెరికా మరియు ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఒక అత్యంత రహస్య ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమార్చబడ్డారు. ఇది ఇరాన్ పాలకులకు, అక్కడి ప్రజలకు కోలుకోలేని దెబ్బ. తమ దేశ సర్వాధికారిని కోల్పోవడంతో ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఖమేనీ మరణానికి ప్రతికారంగా ఇరాన్ తన మిస్సైల్  మరియు డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. కేవలం ఇజ్రాయెల్ మీదనే కాకుండా, అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న గల్ఫ్ దేశాల పైనా ఇరాన్ తన ప్రతాపం చూపుతోంది.  అమెరికా తన మిత్రదేశాల భూభాగం నుండి కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో, ఇరాన్ ఆ దేశాలను కూడా శత్రువులుగానే పరిగణిస్తోంది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన ఈ దేశాల్లో అశాంతి నెలకొంది. ఇక తాజాగా ఇరాన్‌కు చెందిన ఒక కీలకమైన షిప్ పై అమెరికా భీకర దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు వంద మంది ఇరాన్ సైనికులు , సిబ్బంది మరణించినట్లు సమాచారం. ఇది ఇరాన్ సముద్ర మార్గాలపై అమెరికా సాధించిన పైచేయిగా కనిపిస్తోంది.

విశాఖపట్నం తీరంలో జరిగిన అంతర్జాతీయ నేవీ ఈవెంట్‌లో పాల్గొని తిరిగి ప్రయాణమైన ఇరాన్ సైనిక షిప్ శ్రీలంక తీరానికి సమీపంలో దాడికి గురైంది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ వంటి భారీ నేవీ ఈవెంట్‌లో పాల్గొన్న ఇరాన్ నౌక, తన దేశానికి తిరుగు ప్రయాణమైంది. శ్రీలంక ప్రాదేశిక జలాలకు సమీపంలో ఉన్న ఇంటర్నేషనల్ వాటర్స్ లో  ప్రయాణిస్తుండగా, నిశ్శబ్దంగా నీటి అడుగున కాచుకుని ఉన్న అమెరికన్ సబ్‌మెరైన్ నుండి  శక్తివంతమైన టార్పెడోలు దూసుకొచ్చాయి. క్షణాల్లోనే ఆ సైనిక షిప్ అగ్నిగుండంగా మారింది. భారీ విస్ఫోటనాల ధాటికి షిప్ లోని ప్రధాన భాగాలు తునకలయ్యాయి. సాధారణంగా ఇలాంటి దాడుల విషయంలో అగ్రరాజ్యాలు సైలెంట్ గా ఉంటాయి. కానీ ఈసారి అమెరికా నేరుగా రంగంలోకి వచ్చింది. “అవును, ఆ ఇరాన్ నౌకను మేమే లక్ష్యం చేసుకున్నాం” అని అమెరికా రక్షణ శాఖ అధికారికంగా ధ్రువీకరించింది. ఇది వ్యూహాత్మకమైన చర్యగా వారు తెలిపినప్పటికీ, అంతర్జాతీయ సమాజం ఈ పరిణామంతో ఉలిక్కిపడింది. అందిన సమాచారం ప్రకారం 100 మంది ఇరాన్ నౌకా దళ సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  80 మంది సిబ్బంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.నౌక మునిగిపోతున్న సమయంలో మరికొందరు సముద్రంలో చిక్కుకుపోయారు. దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న శ్రీలంక కోస్ట్ గార్డ్ ,  నేవీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సముద్రంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 80 మంది క్షతగాత్రులను రక్షించి, తమ దేశంలోని అత్యున్నత ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇది శ్రీలంక చూపిన గొప్ప మానవీయ దృక్పథం.

నౌకపై దాడి జరిగిన వేళ, పొరుగునే ఉన్న శ్రీలంక దేవుడిలా వచ్చి బాధితులను కాపాడింది. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 100 మంది వీర జవాన్ల మృతదేహాలను శ్రీలంక ప్రభుత్వం గౌరవప్రదంగా సేకరించింది. అనంతరం, దౌత్యపరమైన చర్చల తర్వాత ఆ భౌతిక కాయాలను ఇరాన్ దేశానికి ప్రత్యేక విమానాల ద్వారా తరలించారు. తమ సైనికుల మృతదేహాలను చూసి ఇరాన్ దేశం కన్నీరుమున్నీరవుతోంది. తమ సైనికుల త్యాగం వృధా పోదని ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. శ్రీలంక తీర ప్రాంతం అంతర్జాతీయ నౌకాయాన మార్గాల్లో అత్యంత కీలకమైన ప్రవేశ ద్వారం. ఈ వ్యూహాత్మక ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక సంఘటన అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనానికి దారితీసింది. ఇరాన్‌ కు చెందిన ఒక నౌకపై అమెరికా జరిపిన దాడి ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య చర్చనీయాంశంగా మారింది. శ్రీలంక తీరాల్లో ఇరాన్ నౌక సంచరించడం అనేది కేవలం ఒక సాధారణ ప్రయాణం కాదు. దీని వెనుక లోతైన భౌగోళిక రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్’ (BRI) ప్రాజెక్టులో భాగంగా చైనా-ఇరాన్ సంబంధాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నౌక ఈ ప్రాంతంలో ఉండటం అమెరికాకు కంటగింపుగా మారింది. అడకత్తెరలో పోకచెక్కలా.. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో చిన్న దేశాల తీరాలు చిక్కుకుపోతున్నాయి.  హిందూ మహాసముద్రంపై తన పట్టును నిరూపించుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించడమే లక్ష్యంగా అమెరికా సైనిక చర్యకు పూనుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇరాన్ మాత్రం ఒక బలమైన నమ్మకంతో ఉంది. అంతర్జాతీయ జలాల్లోప్రయాణిస్తున్నప్పుడు ఏ దేశం కూడా నిబంధనలను అతిక్రమించి దాడి చేయదని, ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యం అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉంటుందని ఇరాన్ భావించింది. ఆరు నెలలు సావాసం చేస్తే.. వారు వీరవుతారన్నట్టు.. చైనా అండ చూసుకుని ఇరాన్ ధీమా ప్రదర్శించింది.

ఇరాన్ నౌక తన స్వదేశానికి తిరుగు ప్రయాణమైన వేళ, ఊహించని పరిణామం ఎదురైంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏ దేశం కూడా బహిరంగ సముద్రంలో ఇతర దేశాల నౌకలపై దాడి చేయకూడదు. కానీ, అమెరికా ఈ నిబంధనలను పక్కన పెట్టింది. ఒక్కసారిగా ఇరాన్ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగింది. ఇది కేవలం ఒక నౌకపై జరిగిన దాడి మాత్రమే కాదు, అంతర్జాతీయ సముద్ర చట్టాలను ధిక్కరించడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆశకు హద్దుండాలి.. అధికారానికి నిలకడ ఉండాలి.. కానీ ఇక్కడ చట్టం కంటే శక్తే పైచేయి సాధించింది. ఈ దాడి శ్రీలంక తీరానికి సమీపంలో జరగడం వల్ల దక్షిణ రక్షణ రంగంలో ఆందోళనలు మొదలయ్యాయి. చైనా తన మిత్రదేశమైన ఇరాన్‌ కు మద్దతుగా రంగంలోకి దిగితే, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకునే క్రమంలో చేస్తున్న ఇటువంటి సాహసాలు, సముద్ర మార్గాల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికా దాడిపై ఇరాన్‌ స్పందించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. మరోవైపు గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇలాంటి ఘటనలు సైనికుల మానసిక స్థితిని ప్రభావితం చేసి, భవిష్యత్‌ మిషన్‌ల్లో జాగ్రత్తలు పెంచుతాయి. మరోవైపు భారతదేశం, శ్రీలంక తమ జలాంతర్గాల భద్రతను పరిశీలిస్తున్నాయి. అమెరికా పగ, ఇరాన్ ప్రతీకారం మధ్య అమాయక సైనికులు బలైపోతున్నారు. అరేబియా సముద్రం సాక్షిగా జరిగిన ఈ ఘటన రాబోయే రోజుల్లో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న భయం అందరిలోనూ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *