ఇరాన్ లో డ్రాగన్ ఆయుధాల డొల్లతనం.. చైనా ఇజ్జత్ పాయే..తలెత్తుకోలేని పరిస్థితిలో డ్రాగన్‌!

Spread the love

గల్ఫ్ సెగలు ఇరాన్‌ను తాకుతుంటే, ఆ సెగ తగిలి చైనా పరువు బూడిదవుతోంది. ఇజ్రాయెల్ మిస్సైల్స్ నిప్పులు కురిపిస్తుంటే, చైనా ఇచ్చిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చేతులెత్తేస్తున్నాయి. ఇరాన్‌కు చైనా సరఫరా చేసిన HQ-9B (హెచ్‌క్యూ–9బీ) ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఘోరంగా విఫలమవ్వడమే దీనికి ప్రధాన కారణం.

యుద్ధం జరుగుతున్నది పశ్చిమాసియాలో..మిస్సైల్స్ దూసుకుపోతున్నది గల్ఫ్ ఎయిర్ స్పేస్ కానీ, కంటిమీద కునుకు లేకుండా ఏడుస్తున్నది మాత్రం బీజింగ్‌లో అవును, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో మిస్సైల్స్ పేలుతుంటే, చైనా పరువు గాల్లో కలిసిపోతోంది. అసలు ఇరాన్ నమ్ముకున్న చైనా రక్షణ వ్యవస్థలు ఎందుకు కుప్పకూలాయి? డ్రాగన్ మార్క్ ఆయుధాల వెనుక ఉన్న డొల్లతనం ఏంటి? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ వరుసగా మిస్సైల్స్ తో అటాక్స్ చేస్తుంటే, ఇజ్రాయెల్ తన అధునాతన ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రతీకార దాడులకు దిగుతోంది. అయితే, ఇరాన్ తన ఎయిర్ స్పేస్ ను కాపాడుకోవడానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, చైనా నుంచి దిగుమతి చేసుకున్న HQ-9B (హెచ్‌క్యూ-9బీ) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను బోర్డర్స్ లో మోహరించింది. చైనా ప్రగల్భాలు పలికిన ఈ సిస్టమ్, శత్రువుల విమానాలను, మిస్సైల్స్ ను  గాలిలోనే తుత్తునియలు చేస్తుందని ఇరాన్ గట్టిగా నమ్మింది. కానీ, నిజానికి  యుద్ధం మొదలవ్వగానే సీన్ రివర్స్ అయింది. ఇరాన్ నమ్ముకున్న ఈ చైనా ఆయుధాలు, ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిపణులు ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాటుకుని మరీ లక్ష్యాలను చేధించాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌కు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగితే.. చైనాకు మాత్రం తీరని పరువు నష్టం జరిగింది. ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో రష్యాతో, అమెరికాతో పోటీ పడాలని చూస్తున్న చైనాకు ఇది కోలుకోలేని దెబ్బ. చైనా నుంచి HQ-9B వ్యవస్థను కొనుగోలు చేసిన ఇరాన్, ఇప్పుడు దానికి సమాధానం చెప్పుకోలేక తలపట్టుకుంటోంది.

చైనా తన ఆయుధాలు అమెరికా టెక్నాలజీకి ధీటుగా ఉంటాయని గొప్పలు చెప్పుకుంటుంది. కానీ, ఇజ్రాయెల్ తన ఎఫ్-35 యుద్ధ విమానాలతో దాడులు చేస్తుంటే, చైనా రాడార్లు వాటిని గుర్తించలేకపోయాయని సమాచారం. దీనివల్ల చైనా ఆయుధాల నాణ్యత పై అంతర్జాతీయంగా పెద్ద చర్చ మొదలైంది. చైనా క్లెయిమ్ చేసిన రేంజ్ మరియు అక్యూరసీ క్షేత్రస్థాయిలో కనిపించలేదు.

ఇజ్రాయెల్ ప్రయోగించిన స్టెల్త్ క్షిపణులను గుర్తించడంలో HQ-9B రాడార్లు పూర్తిగా విఫలమయ్యాయి. యుద్ధ సమయంలో ఆయుధాలు మొరాయించడం చైనా తయారీ లోపాలను ఎత్తిచూపుతోంది. ఇప్పుడు ఇరాన్ వద్ద ఈ వ్యవస్థలు ఫెయిల్ అవ్వడంతో, మిగిలిన అరబ్ దేశాలు లేదా ఇతర మిత్ర దేశాలు చైనా ఆయుధాలను కొనడానికి భయపడుతున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా కూటమిని ఢీకొట్టడానికి ఇరాన్‌ను పావుగా వాడుకోవాలని చూసిన చైనాకు, ఇప్పుడు తన టెక్నాలజీ ప్రపంచం ముందు నవ్వులపాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది.

గతేడాది జూలై నెలలో చైనా,  ఇరాన్ మధ్య ఒక కీలకమైన ఒప్పందం జరిగింది. అదే ‘ఆయిల్‌ ఫర్‌ వెపన్స్‌’ (Oil for Weapons). ఆంక్షలతో సతమతమవుతున్న ఇరాన్‌కు తన చమురును అమ్ముకోవడానికి చైనా ఒక మార్గం చూపింది. కానీ దానికి బదులుగా చైనా తన రక్షణ వ్యవస్థలను ఇరాన్ నెత్తిన రుద్దింది. అందులో ప్రధానమైనది HQ-9B క్షిపణి వ్యవస్థ. ఈ HQ-9B సిస్టమ్‌ను చైనా మార్కెట్ చేసిన తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రష్యాకు చెందిన S-300, అమెరికాకు చెందిన Patriot క్షిపణి వ్యవస్థల కంటే ఇది మెరుగైనదని చైనా గొప్పలు చెప్పుకుంది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం చైనా టెక్నాలజీ తుస్సుమంది.

చైనా టెక్నాలజీపై ఉన్న నమ్మకంతో ఇరాన్ తన ప్రధాన నగరాల రక్షణ బాధ్యతను HQ-9Bకి అప్పగించింది. దీనిని కేవలం ఒంటరిగా వాడకుండా, తన స్వదేశీ క్షిపణి వ్యవస్థలైన బాబర్‌-373 (Bavar-373) , ఖోర్దాద్‌-15 (Khordad-15) లతో కలిపి మోహరించింది. రాజధాని టెహ్రాన్ వంటి కీలక ప్రాంతాల్లో ఒక పటిష్టమైన రక్షణ కవచం ఏర్పడిందని ఇరాన్ భావించింది.ఇరాన్ తన ఆకాశాన్ని అజేయమైన కోటగా మార్చుకోవాలనుకుంది. స్వదేశీ సాంకేతికతకు చైనా మెరుపులు అద్ది.. శత్రువులకు చుక్కలు చూపిద్దామని ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టింది.

చైనా రక్షణ రంగంలో తనను తాను సూపర్ పవర్‌గా చెప్పుకుంటున్నా, అసలు యుద్ధ తంత్రంలో తన పరికరాల వైఫల్యాన్ని దాచలేకపోతోంది. రష్యా S-300 కన్నా మెరుగని ప్రచారం చేసి, చివరికి ఇరాన్ భద్రతను ప్రమాదంలో పడేసింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో హెచ్‌క్యూ–9బీ ఒక్క మిస్సైల్‌ను కూడా అడ్డుకోలేదు. భారీ నష్టాలకు దారితీసింది. 20 ప్రాంతాల్లో విధ్వంసం జరిగింది., సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణానికి కారణమైంది. దీంతో చైనా మాల్‌ ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి అర్థమైంది. 2025 మేలో పాకిస్తాన్‌ ’ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత దాడులకు హెచ్‌క్యూ–9బీ విఫలమైంది. కిరాణా హిల్స్, నూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌లు లక్ష్యాలు. వెనెజువెలాలో అమెరికా దాడుల సమయంలోనూ ఇదే పరిస్థితి. మధురో కుటుంబ కిడ్నాప్‌కు స్పందన లేదు. ఈ సంఘటనలు చైనా సాంకేతికత బలహీనతను బహిర్గతం చేశాయి. ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో చైనా ప్రతిష్ట దెబ్బతినడంతో అమెరికా, రష్యా వంటి ప్రత్యర్థులు లాభపడతారు. ఇరాన్‌తో ఆర్థిక ఒప్పందాలు దెబ్బతింటాయి; చైనా ఆయిల్‌ సరఫరా ఆధారపడి ఉంది. ఈ వైఫల్యం భవిష్యత్‌ ఒప్పందాలకు అడ్డంకిగా మారవచ్చు.  వ్యాపారంలో తెలివితేటలు ఉండొచ్చు కానీ, యుద్ధంలో నాణ్యత ఉండాలి. ‘చైనా మాటలు కోటలు దాటుతాయి.. కానీ క్షిపణులు మాత్రం సరిహద్దు దాటవు’ అని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *