ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో తెలిసిందే. కాగా, తాజాగా మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో ఈ అంశంపై మొదటి సారి స్పందించారు. జెఫ్రీ ఎప్ స్టీన్ తో స్నేహంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎప్ స్టీన్ తో కలిసి గడిపిన ప్రతీ క్షణం పట్ల ఇప్పుడు చింతిస్తున్నానని, క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. అతడితో తాను స్నేహం చేసి ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై మాట్లాడారు. అయితే, ఎప్ స్టీన్ ఫైల్స్ లో బయటపడ్డ ఈమెయిల్ మాత్రం నిజం కాదని, ఏ ఉద్దేశంతో అతను ఆ మెయిల్ ను రాశాడో తెలియదని బిల్ గేట్స్ పేర్కొన్నారు.
ఆ మెయిల్ కూడా ఎవరికీ పంపలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ‘రష్యన్ మహిళలతో లైంగిక సంబంధాల వల్ల బిల్ గేట్స్ కు సుఖవ్యాధులు సోకాయి. ఈ విషయం ఆయన భార్యకు తెలియకుండా ఉండేందుకు మందులు కావాలని కోరాడు. ఆయన కోరినట్లే మందులు ఇప్పించాను అంటూ ఎప్ స్టీన్ ఓ ఈమెయిల్ లో పేర్కొన్నాడు. దానిని ఎవరికీ పంపకుండా డ్రాఫ్ట్ బాక్స్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. తాజాగా ఈ ఈమెయిల్ బయటపడింది. ఇక అంతకుముందు బిల్ గేట్స్ మాజీ భార్య మిలిందా ఓ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. బిల్ గేట్స్ తో విడాకులకు ఎప్ స్టీన్ తో ఆయనకు ఉన్న స్నేహమే కారణమని స్పష్టం చేశారు. ఎప్ స్టీన్ ఫైల్స్ లో తాజాగా మరోమారు బిల్ గేట్స్ పేరు బయటకు రావడం, బిల్ గేట్స్ కు రష్యన్ మహిళలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ విషయంపై జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత బిల్ గేట్స్ కే ఉందన్నారు.