మిడిల్ ఈస్ట్ పరిస్థితులు ప్రపంచాన్నికలవరపెడుతున్నాయి. ఒకవైపు శత్రు భీకరంగా ఇజ్రాయెల్, అమెరికాలు తమ దాడులతో చెలరేగుతున్నప్పటికీ ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెండు బలమైన శక్తులు ఏకమై దాడులు చేస్తున్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నేలకొరిగినా.. ఆ దేశం ఇంకా ‘సై’ అంటోంది. అసలు ఖమేనీ లేని ఇరాన్‌కు అంత ధైర్యం ఎక్కడిది? ఆ దేశాన్ని నడిపిస్తున్న ఆ ‘హిడెన్ పవర్’ ఏంటి? ఇరాన్ గుండెల్లో దాగి ఉన్న ఆ క్షిపణి నగరాల రహస్యమేంటి?
అదేనా ఇరాన్ దైర్యం..క్లిష్ట పరిస్థితుల్లో తన వ్యూహం తనకుందా… అవును.. ఇరాన్ పరిస్థితి ఇప్పుడు సరిగ్గా ఇలాగే ఉంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేలకొరిగారు. ఆ తర్వాత ఇక ఇరాన్ పని ఖేల్ ఖతం అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే.. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణులు తగ్గలేదు, ఆ దేశం చూపిస్తున్న తెగింపు తగ్గలేదు. ఖమేనీ చనిపోయినా…. ఇరాన్ సూపర్ పవర్ అలాగే ఉంది. సాధారణంగా ఏ దేశానికైనా సుప్రీం లీడర్ చనిపోతే ఆ దేశం గందరగోళంలో పడుతుంది. కానీ ఇరాన్ నిర్మాణం వేరు. ఇరాన్ కేవలం ఒక వ్యక్తి మీద నడిచే దేశం కాదు, అదొక పటిష్టమైన వ్యవస్థ మీద నడిచే దేశం. అక్కడ ఖమేనీ లేకపోవచ్చు, కానీ ఆయన సిద్ధాంతం ప్రతి సైనికుడి రక్తంలో ఉంది.
ఇరాన్‌కు ఉన్న అతిపెద్ద బలం దాని అధికార వికేంద్రీకరణ. సుప్రీం లీడర్ కింద ఉండే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ యుద్ధ సమయంలో నిర్ణయాలను సెకన్ల మీద తీసుకుంటుంది. ఇరాన్ లో Islamic Revolutionary Guard Corps అనే ప్రత్యేక సైన్యం ఉంది. ఇదే ఇరాన్ అసలైన ‘హిడెన్ పవర్’. సాధారణ సైన్యం సరిహద్దులను కాపాడితే, IRGC దేశ సిద్ధాంతాన్ని, ఇస్లామిక్ విప్లవాన్ని కాపాడుతుంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 30 నుంచి 40 శాతం IRGC నియంత్రణలోనే ఉంటుంది. అంటే యుద్ధం చేయడానికి కావాల్సిన డబ్బు కోసం వీరు ప్రభుత్వం వైపు చూడక్కర్లేదు. సొంతంగా పరిశ్రమలు, కంపెనీలు నడుపుతూ యుద్ధ ట్యాంకులు తయారు చేయగలరు. ఇరాన్ బయట ఉన్న హిజ్బుల్లా, హుతీలు, హమాస్ వంటి గ్రూపులకు శిక్షణ ఇచ్చేది, నడిపించేది వీరే. ఖమేనీ ఉన్నా లేకున్నా ఈ నెట్వర్క్ ఇండిపెండెంట్ గా వ్యవహరించగలదు.
ఇరాన్ కేవలం తన సరిహద్దుల్లోనే యుద్ధం చేయదు. శత్రువును తన ఇంటి దాకా రానివ్వకుండా, శత్రువు ఇంట్లోనే యుద్ధం చేస్తుంది. లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్ ఇలా మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ తన పంజాను విసిరింది. అమెరికా మిత్రదేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలపై ఇరాన్ నిరంతరం ఒత్తిడి తీసుకురావడానికి కారణం ఇదే. ఖమేనీ మరణం తర్వాత ఈ ప్రాక్సీ గ్రూపులు మరింత రెచ్చిపోయి దాడులు చేస్తున్నాయి. ఎందుకంటే, ఇరాన్ వారికి కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాదు, వారిని ఆయుధ స్వయంసమృద్ధి గల వారుగా మార్చింది.
అమెరికా దగ్గర అత్యాధునిక ఎఫ్-35 విమానాలు ఉండొచ్చు. కానీ ఇరాన్ దగ్గర Asymmetric Warfare ఉంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేయడం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు ఎంతటి విధ్వంసం సృష్టించాయో లోకమంతా చూసింది. ఇరాన్ పర్వతాల లోపల, భూమికి వందల అడుగుల అడుగున ‘మిస్సైల్ సిటీలు’ నిర్మించింది. వీటిని గగనతలం నుంచి ధ్వంసం చేయడం అసాధ్యం. ఇరాన్ లో ఉన్న మరో ముఖ్యమైన శక్తి అక్కడి మతపరమైన భావజాలం. అక్కడ యుద్ధాన్ని కేవలం ప్రాదేశిక పోరాటంగా చూడరు, అది ఒక ‘జిహాద్’ లేదా పవిత్ర యుద్ధంగా భావిస్తారు. నాయకుడు మరణిస్తే ఆయన ‘అమరవీరుడు’ అవుతాడే తప్ప, ఓడిపోయినట్టు కాదు. ఈ భావజాలమే ఇరాన్ సైనికులకు చావు భయం లేకుండా చేస్తుంది.
అమెరికా అనుకున్నట్టుగా ఖమేనీ మరణం ఇరాన్‌ను బలహీనపరచలేదు ఇరాన్ సైనిక శక్తి అనగానే ప్రపంచానికి ముందుగా గుర్తొచ్చేది IRGC. అంటే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఇది కేవలం ఒక సైన్యం కాదు, ఇరాన్ సిద్ధాంతాలకు నిలువుటద్దం. ఖమేనీ ఉన్నా లేకపోయినా, ఈ బలగాలు దేశం కోసం చివరి రక్తపు చుక్క వరకు పోరాడేలా శిక్షణ పొందాయి. ఈ IRGC బలగాలే ఇరాన్ కు వెన్నెముక. ఇజ్రాయెల్ వంటి శత్రువుల సూపర్ వెపన్లను ఎదుర్కోవడానికి వీరు నిరంతరం సిద్ధంగా ఉంటారు. యుద్ధం వస్తే డెడ్ ఎండ్ వరకు వెళ్లడానికి వీరు వెనకాడరు.ఇరాన్ పైన ఎన్ని బాంబులు వేసినా, ఆ దేశం మళ్లీ మళ్లీ కోలుకుంటుంది. దానికి కారణం భూమి పైన ఉన్న సైన్యం కాదు, భూమి లోపల ఉన్న మిస్సైల్ సిటీలు. టెహ్రాన్ తో పాటు దేశ సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ భూగర్భ నగరాలు ఇరాన్ అసలు సిసలు ఆయుధ కర్మాగారాలు.ఈ భూగర్భ నగరాల్లో ఉండే సైన్యం ఎవరు? అక్కడ ఎన్ని క్షిపణులు ఉన్నాయి? అనే విషయం ఇరాన్ ఉన్నతాధికారుల్లో కూడా అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఇరాన్ బలం కేవలం ఆ దేశ సరిహద్దులకే పరిమితం కాలేదు. మిడిల్ ఈస్ట్ అంతటా ఇరాన్ మద్దతు ఉన్న ప్రాక్సీ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఇరాన్ రక్షణ వ్యూహం సముద్రంలో కూడా అత్యంత పటిష్టంగా ఉంది. హోర్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో ఇరాన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. శత్రువుల నౌకలు ఒక్క అడుగు తప్పుగా వేసినా, సముద్ర గర్భంలోనే సమాధి చేసే సాంకేతికత ఇరాన్ సొంతం.
ఇరాన్ శక్తి గ్యాస్, చమురు..వీటిని కాపాడుకుంటే ఎంత పెద్ద దేశాన్నైనా ఢీ కొట్టచ్చనేది ఇరాన్ వ్యూహం. అధునాతన డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీ,సైబర్ దాడులతో పాటు ఇరాన్ రహస్య శక్తుల్లో అణుబాంబులు మరొకటి.యురేనియం నిల్వలతో ఎంత పెద్ద యుద్ధమైనా ఇరాన్ సై అంటుంది. ఖమేనీ లేకపోయినా ఆయన సృష్టించిన రక్షణ వ్యవస్థ ఇరాన్‌ను నడిపిస్తూనే ఉంటుంది. మొదటి నుంచీ ఖమేనీ పెంచి పోషించిన లెబనాన్ మిలిటెంట్లు, హమాస్ ఉగ్రవాద సంస్థలు ఇరాన్‌కు ఇనుప కవచాల్లాంటివని చెప్పచ్చు. లెబనాన్ నుంచి ఇరాన్‌కు సొరంగ మార్గాలున్నాయని చెబుతారు. మత సంస్థలకు, ఆర్మీకి, రహస్య శక్తులకు సుప్రీం ఖమేనీనే బాస్. ఆయన పదేళ్ల కిందట ఆర్డర్ ఇచ్చాడంటే.. ప్రస్తుతం ఆయన లేకున్నా అవి అమల్లో ఉండాలన్నదే దానర్థం. అందుకే ఇరాన్ ఇంత ధీటుగా అమెరికాతో సై అంటోంది. సుప్రీం చచ్చినా చావోరేవో అని ఢీ కొడుతోంది. ఎన్ని దేశాలు ఏకమైనా ఏం చేయలేరని ఎదురెళ్తోంది.