ఇరాన్ , అమెరికా మధ్య మాటల యుద్ధం,మిస్సైల్ దాడులు గత కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ తాజాగా ఇరాన్ చేసిన ప్రకటన మిడిల్ ఈస్ట్ లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ మొహ్సెన్ రెజాయ్ అమెరికాకు ఒక బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ ఫుల్ పోస్ట్ చేశారు. ఆయన ట్వీట్ చేస్తూ.. అమెరికా తన కోసం తాను సృష్టించుకున్న నరకం నుండి ఎంత గింజుకున్నా తప్పించుకోలేదు. యుద్ధ రంగంలో, దౌత్య పరంగా , మీరు మాపై విధించిన ఆర్థిక దిగ్బంధనాన్ని ఎదుర్కోవడంలో ఇరాన్ ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. ఈ కొత్త వ్యూహం మీ పునాదులను కదిలించేలా ఎలా ఉండబోతోందో మీరు త్వరలోనే చూస్తారు అని అత్యంత ఘాటుగా హెచ్చరించారు. అంటే ఇరాన్ కేవలం మాటలతో కాకుండా అటు మిలటరీ పరంగానూ, ఇటు దౌత్య పరంగానూ అమెరికాపై భారీ వ్యూహానికి ఇరాన్ రెడీ అయినట్లే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండు దేశాల సైన్యాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్న విషయం విదితమే. గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ కు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ దళాలు సీ మైన్స్ అమర్చడానికి ప్రయత్నించాయి. అలాగే అక్కడ ఉన్న అమెరికా సిబ్బందిపై కూడా దాడులు జరిగాయి. దీనికి ప్రతికారంగా అమెరికా దళాలు ఇరాన్ పై రిటాలియేషన్ దాడులు చేశాయి. దీంతో ఇరాన్ సైన్యం మరింత రెచ్చిపోయింది. జోర్డాన్, యూఏఈ దేశాల్లో ఉన్న అమెరికా మిలటరీ బేస్ లు లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఇర్బిల్ లోని అమెరికా ఫెసిలిటీస్ పై, జోర్డాన్ లోని యూఎస్ మెరైన్ ట్రైనింగ్ క్యాంప్ పై ఒకేసారి మిస్సైల్స్ , డ్రోన్ లతో విరుచుకుపడింది. అంతేకాదు, సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు ఆయిల్ ట్యాంకర్ల మీద కూడా ఊహించని దాడులు జరిగాయి. ఈ ట్యాంకర్ దాడుల వల్ల సౌదీ అరేబియా షిప్పింగ్ సంస్థకు చెందిన ఇద్దరు ఫిలిప్పీన్స్ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇరాన్ నేరుగా ప్రకటించకపోయినా, వాళ్ల పనే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో మిగిలిన గల్ఫ్ దేశాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాయి. ఇక తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎలాగైనా చేధించాలని, పశ్చిమాసియాలో అమెరికా ఆధిపత్యాన్ని అంతం చేయాలని ఇరాన్ ఎప్పటి నుంచో టార్గెట్ గా పెట్టుకుంది. ఇప్పుడు రష్యా, చైనా లాంటి దేశాల పరోక్ష మద్దతుతో తన ప్రాక్సీ సంస్థలు అయిన హెజ్బొల్లా, హౌతీలు, హమాస్ ద్వారా అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఒక పకడ్బందీ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వరుస దాడులు, కొత్త యుద్ధ వ్యూహం ప్రకటనలతో అమెరికా కూడా సీరియస్ అయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. ఇరాన్ గనక మరోసారి మా స్థావరాలపై దాడులు చేస్తే, ఇంతకుముందు ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ప్రతిదాడులు చూస్తుందని దాడులు ఆపకపోతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అనే దేశం భూమిపై నామమాత్రంగానే మిగులుతుంది అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. అమెరికాకు ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలు ఉండటం, పశ్చిమాసియాలో వారికి భారీ ఎత్తున మిలటరీ స్థావరాలు ఉండటంతో పరిస్థితి ఎటు దారితీస్తుందో అన్న టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అమెరికా పునాదులు కదిలిస్తామంటూ ఇరాన్ ప్రకటించిన కొత్త యుద్ధ వ్యూహం చూస్తుంటే ఈ రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇరాన్ దౌత్యపరంగా, సైనికంగా అమెరికాను ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, అమెరికా ఏమో ఇరాన్ ను నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరిస్తోంది. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం వస్తే.. ప్రపంచంలో ఇంధన ధరలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.