రెండేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో తలెత్తిన విద్యార్థుల తిరుగుబాటుతో భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు రప్పించేందుకు ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తన భారత పర్యటనకు సైతం హసీనా అప్పగింతనే కండిషన్‌గా పెట్టడం వంటివి కూడా చేశారు. ఇక దీనిపై స్పందించిన హసీనా, బంగ్లాదేశ్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనను ఎవరూ అప్పగించాల్సిన అవసరం లేదని, డిసెంబర్ నాటికి తానే స్వయంగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నానని ప్రకటించారు. అంతే కాదు షేక్ హసీనా బంగ్లా ప్రధానికి దిమ్మతిరిగే కౌంటర్ కూడా ఇచ్చారు. ఆయన గత చరిత్రను ఆమె గుర్తుచేస్తూ సూటి ప్రశ్నలు సంధించారు.
రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను సైతం హసీనా అప్పగింతతో ముడిపెట్టాలని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం చూస్తోంది. కానీ హసీనా మాత్రం ఆ ఎక్స్‌ట్రాడిషన్ ట్రీటీ అవసరమే లేదంటున్నారు. భారత మీడియాతో మొదటిసారి మాట్లాడిన షేక్ హసీనా.. బంగ్లా ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తీరుపై విమర్శలు గుప్పించారు. నన్ను అప్పగించడం గురించి ఆయనెందుకు అంతగా ఆందోళన చెందుతున్నారు? నా దేశానికి నేనే స్వయంగా తిరిగి వెళ్తాను. జీవితాంతం విదేశాల్లో ఉండలేను కదా అని హసీనా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తారిఖ్ రెహ్మాన్ గత చరిత్రను ఆమె గుర్తుచేశారు. 2007లో రాజకీయాలు చేయనని స్టాంప్ పేపర్‌పై రాసిచ్చి లండన్ పారిపోయిన తారిఖ్ రెహ్మాన్.. అక్కడ తన తల్లి ఖలీదా జియా స్థానంలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీ మీటింగ్స్ నడిపారని హసీనా విమర్శించారు. నాడు ఆయన్ను అప్పగించమని తాము బ్రిటన్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, ఇప్పుడు తాను భారత్‌లో ఒక అంతర్జాతీయ ఫోరమ్‌లో ప్రెస్‌మీట్ పెడితే ఆయనకు వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.
బంగ్లాదేశ్ అంతర్గత భద్రత, ఆర్థిక పరిస్థితిపై కూడా హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ చేసిన మరో పాకిస్తాన్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. బంగ్లాదేశ్ నెమ్మదిగా మరో పాకిస్తాన్‌గా మారుతోందని ఐక్యరాజ్యసమితి నివేదికలు సైతం హెచ్చరిస్తున్నాయని హసీనా గుర్తుచేశారు. మతవాద రాజకీయాలు, ఉగ్రవాద నెట్‌వర్క్‌లు పెరిగిపోతున్నాయని.. ఇది కేవలం బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదు, మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, దేశంలో విద్యుత్, గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని.. ప్రజలు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. ఇలాంటి కష్టకాలంలో జనం ఆకలి తీర్చాల్సింది పోయి.. సుమారు 19 వేల కోట్లు ఖర్చు పెట్టి చైనా నుంచి ఫైటర్ జెట్స్ కొనాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఎన్‌పీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు .
హసీనాకు బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఇప్పటికే మరణశిక్ష విధించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే ఆమె జైలుకు వెళ్లడం లేదా ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయినా సరే తాను వెనక్కి తగ్గనని ఆమె తెగేసి చెప్పారు . 1947లో ఏర్పడిన అవామీ లీగ్.. బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ ప్రాణప్రదంగా నడిపించిన పార్టీ అని హసీనా గుర్తుచేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అవామీ లీగ్ నాయకులపై తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తోందని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆమె స్పష్టం చేశారు. నేను వెళ్లగానే జైలులో పెట్టొచ్చు, లేదా చంపేయొచ్చు. కానీ నా దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నేను దూరంగా ఉండలేను. నాకు చావు అంటూ వస్తే నా సొంత గడ్డ మీదే రావాలి.. నా తల్లిదండ్రులు రక్తం చిందించిన చోటే రావాలి అంటూ హసీనా అత్యంత భావోద్వేగ భరితంగా ప్రసంగించారు.డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్‌కు చేరుకుంటానని స్పష్టం చేసిన హసీనా దానిపై త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయో బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టాలని షేక్ హసీనా తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఆ దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతోంది? అనేది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.