స్మార్ట్ఫోన్ నేడు మన జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే, పరిమితికి మించిన స్మార్ట్ఫోన్ వాడకం కంటి చూపును దెబ్బతీయడమే కాకుండా, మన శరీరంలోని అనేక ఇతర అవయవాలు మరియు వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మొదటిగా, అత్యధికంగా గురయ్యేది కళ్లు అనేది తెలిసిందే. వీటితో పాటు ఇతర శరీర భాగాలపై కూడా దీని దుష్ప్రభావాలు పడతాయి. మెడ మరియు వెన్నుముక. ఫోన్ చూస్తున్నప్పుడు దాదాపు అందరూ తలను ముందుకు వంచి కూర్చుంటారు. దీనిని ‘టెక్స్ట్ నెక్ సిండ్రోమ్’ (Text Neck Syndrome) అంటారు. సాధారణంగా మన తల బరువు 4-5 కేజీలు ఉంటే, తలను ముందుకు వంచడం వల్ల మెడ ఎముకలపై మరియు వెన్నుముకపై ఏకంగా 20-30 కేజీల ఒత్తిడి పడుతుంది. దీనివల్ల భుజాల నొప్పులు, తీవ్రమైన మెడ నొప్పి మరియు భవిష్యత్తులో సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి తీవ్ర సమస్యలు వస్తాయి.ఇక దీని వలన ఎఫెక్ట్ అయ్యే మిగిలిన అవయవాలు చేతులు మరియు వేళ్ళు. ఎడతెరిపి లేకుండా ఫోన్లో టైపింగ్ చేయడం, గేమ్స్ ఆడటం లేదా స్క్రోలింగ్ చేయడం వల్ల చేతి వేళ్ళు, అరచేయి మరియు మణికట్టులోని నరాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఇది ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ (Carpal Tunnel Syndrome) లేదా ‘రిపీటిటివ్ స్ట్రెయిన్ ఇంజ్యూరీ’ కి దారితీస్తుంది. దీనివల్ల చేతి వేళ్ళలో తిమ్మిర్లు రావడం, నొప్పులు పుట్టడం మరియు చేతి పట్టు బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరగా, నిద్ర మరియు మానసిక ఆరోగ్యం. రాత్రి వేళల్లో ఫోన్ వాడటం వల్ల శరీరంలో ‘మెలటోనిన్’ అనే నిద్రను ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది తీవ్ర నిద్రలేమి (Insomnia)కి దారితీసి, మెదడు చురుకుదనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఫోన్ వాడకాన్ని తగ్గించడం శారీరక, మానసిక ఆరోగ్యానికి అత్యంత ఆవశ్యకమని నిపుణులు సూచిస్తున్నారు.